సంక్రాంతి పండుగ అంటే రంగవల్లులు, గొబ్బెమ్మలు, హరినాథుల కీర్తనలు, పిండి వంటలు ఒక ఎత్తు అయితే.. కోడి పందెలు మరోఎత్తు. సంక్రాంతి సంబరాలకు సరికొత్త ఉత్సాహాన్ని, ఉద్వేగాన్ని తీసుకొస్తాయి కోడి పందాలు. కోళ్ల పందాలను ప్రభుత్వం నిషేదించిన సంక్రాంతి సంబురంలో భాగంగా ప్రతియేటా జరుగుతూనే ఉన్నాయని పందాలు. కొన్ని చోట్ల ఈ కోడి పందాలు సరదా కోసం నిర్వహిస్తుండగా.. మరికొన్ని చోట్ల కోట్లాది రూపాయల బెట్టింగ్ జరుగుతోంది. రాష్ట్రం మొత్తం సంక్రాంతి ఒక ఎత్తు అయితే.. ఉభయ గోదావరి జిల్లాల్లో సంక్రాంతి నెక్స్ట్ లెవల్‌లో ఉంటుంది.
సంబరాలతో పాటు కోడి పందాలు కూడా ఉభయ గోదావరి జిల్లాలో పెద్ద ఎత్తున జరుగుతాయి. సంక్రాంతి పండుగ వేళ ఒక్క గోదావరి జిల్లాలోనే కోట్లలో కోడి పందాలు బెట్టింగ్ జరుగుతుందంటే అతిశయోక్తి కాదు. ప్రతి ఏడాదిలాగా ఈ సారి కూడా గోదావరి జిల్లాల్లో కోడి పందేల జాతర మొదలయ్యింది. ప్రభుత్వం నిషేదం విధించినా.. మనల్నెవడ్రా ఆపేది అంటూ కత్తులు కట్టుకుని కాలుదువ్వుతున్నాయి పందెం కోళ్లు. వందలు వేలు దాటి లక్షల్లో బెట్టింగులు కాస్తూ రెచ్చిపోతున్నారు పందెంరాయుళ్లు.
పోలీసులు ఆంక్షలు విధించిన మనకి కాదులే అంటూ లైట్ తీసుకుంటున్నారు పందెం నిర్వాహుకులు. ఇప్పటికే 10 వేలకు 20వేలు.. 50వేలకు లక్ష.. లక్షకు రెండు లక్షలంటూ జోరుగా బెట్టింగ్స్ సాగుతున్నాయి. పందెం రాయుళ్లను ఆకర్శించేందుకు నిర్వాహకులు వినూత్న ఐడియాలు అవలంభిస్తున్నారు. ఎక్కువ పందాలు గెలిచినవారికి కార్లు, బైకులు అంటూ ఆకర్షనీయమైన బహుమతులు ఇస్తామని ఆఫర్ చేస్తున్నారు. గోదావరి జిల్లాల్లో అయితే ఇంకా ఖరీదైన బహుమతులు అనౌన్స్ చేశారు. పందెంలో గెలిచిన వారికి బుల్లెట్, బైక్ , రెండు కాసుల బంగారం అంటూ బెట్టింగ్ రాయుళ్లను కవ్విస్తున్నారు.
ఈ సంక్రాంతి పండగను పురస్కరించుకుని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 200 బరులు సిద్ధం చేసినట్లు టాక్. ఈ సారి భీమవరంలో కూడా కోడి పందాలు భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు. ఏకంగా క్రికెట్ స్టేడియాలను తలపించేలా బరులను సిద్ధం చేశారు నిర్వాహకులు. దీంతో ఈ సారి అందరి చూపు భీమవరంలో జరిగే కోడి పందాలపైనే ఉంది. దీంతో భీమవరంలో నెల రోజుల క్రితమే హోటల్స్ ఫుల్ అయిపోయాయి. మొత్తంగా ఈ మూడు రోజులూ ఎక్కడ చూసిన పందెం రాయుళ్ల జోషే కనిపిస్తోంది. నిర్వాహకులు తమదైన శైలీలో సిద్ధం అవుతుంటే పందాలను అడ్డుకునేందుకు పోలీసులు కూడా వీరికి ధీటుగా ప్లాన్ చేస్తున్నారు.