కర్ణాటక ఎన్నికల్లో ఆ స్వామిజీ జోస్యమే నిజమైంది. ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందో ముందే చెప్పేశారు. ఖచ్చితమైన ఫలితాలు వెల్లడవుతాయని ఫిబ్రవరిలో ఆయన ప్రవచించారు. ఎన్నికల ఫలితాల్లో స్వామీజీ చెప్పినట్లే జరిగింది. ప్రస్తుతం కర్ణాటకలో ఈ జోస్యం చర్చనీయాంశమైంది.
జోస్యం చెప్పడంలో హాసన్ జిల్లా కోడిమఠం అధ్యక్షులు శివానంద శివయోగి రాజేంద్ర మహాస్వామీజీ అలియాస్ కోడిమఠం శ్రీను పేరెన్నికగన్నారు. ఆయన ఏం చెబితే అది జరిగి తీరుతుందని ప్రజల నమ్మకం. గతంలో ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతాయని చెప్పారు. అది జరిగింది. తాజాగా కర్ణాటక ఎన్నికలపై కూడా ఆయన చెప్పిందే నిజమైంది.
ఏం చెప్పారంటే..
కర్ణాటక ఎన్నికల్లో ఒకే పార్టీకి మెజారీటీ వస్తుందని శివానంద శివయోగి రాజేంద్ర మహాస్వామీజీ ప్రవచించారు. రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఉండదని చెప్పారు. ఎట్టిపరిస్థితుల్లో సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి రాదని బల్లగుద్ది చెప్పారు. ప్రస్తుతం ఆయన చెప్పినట్లే జరిగింది. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మెజారిటీ వచ్చింది. ఆ పార్టీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది.
ఎగ్జిట్ పోల్స్ కూడా..
మే 10న పోలింగ్ తర్వాత ఎగ్జిట్ పోల్స్ కూడా కాంగ్రెస్ కే పట్టం కట్టాయి. చాలా వరకు కాంగ్రెస్ పార్టీకే అధికారం దక్కుతుందని వెల్లడించాయి. కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వం రాదని..ఒకే పార్టీకి మెజారిటీ సీట్లు దక్కుతాయని అనేక సర్వేలు ప్రకటించాయి.