- గడువు తేదీ తప్పుగా ముద్రించారన్న ఎంఈవో
- మరో స్టిక్కర్వేసి పంపిస్తున్న అధికారులు
- జగిత్యాల జిల్లా కొడిమ్యాలలో ఘటన
కొడిమ్యాల, వెలుగు: జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో ప్రభుత్వం స్కూల్స్‌కు ఎక్స్పైరీ అయిన రాగి పిండి ప్యాకెట్లు పంపించిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ఆ పిండితో చేసిన జావ తాగిన తమ పిల్లలకు ఏమన్నా అవుతుందేమోనని ఆందోళన చెందుతున్నారు. స్టూడెంట్లలో రోగ నిరోధక శక్తి పెంచడానికి ప్రభుత్వం పాఠశాలలకు రాగి పిండి ప్యాకెట్లు సరఫరా చేస్తోంది. ఈనెల 23న కొడిమ్యాల మండలంలోని అన్ని స్కూల్స్ కు ఈ నెల18వ తేదీ వరకే గడువున్న రాగి పిండి ప్యాకెట్లను పంపించారు.
టీచర్లు కూడా గమనించకుండా పిల్లలకు అలాగే జావా చేసి ఇస్తున్నారు. కొడిమ్యాలలో ఒక స్టూడెంట్ప్యాకెట్ను పరిశీలించి చూడగా ఎక్స్పైరీ డేట్ సెప్టెంబర్18, 2023 వరకే అని రాసి ఉంది. భయపడ్డ అతడు వారి తల్లిదండ్రులకు చెప్పాడు. ఈ విషయం తెలిసిన మిగతా తల్లిదండ్రులు తమ పిల్లల గురించి ఆందోళన చెందుతన్నారు.
రెండు నెలలు కాదు మూడు నెలలు
ఈ విషయమై ఎంఈఓ శ్రీనివాస్ ను వివరణ కోరగా ప్రతి ప్యాకెట్‌కు గడువు మూడు నెలలు ఉంటుందని, తాము ఇచ్చిన ప్యాకెట్లపై రెండు నెలలే అని తప్పుగా ముద్రించారన్నారు. తాము పంపిన ప్యాకెట్లను తయారు చేసింది 2023 జూలై 19 అని, వాటి గడువు వచ్చే నెల19 వరకు ఉంటుందన్నారు. ఇప్పుడు పంపించే వాటిపై మరో స్టిక్కర్ అతికించి పంపిస్తున్నామని, తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దన్నారు.