అత్తగారి ఊళ్లో కేసీఆర్​కు నిరసన సెగ

అత్తగారి ఊళ్లో కేసీఆర్​కు నిరసన సెగ

బోయినిపల్లి, వెలుగు: మాజీ సీఎం కేసీఆర్ కు తన అత్తగారి ఊరు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం కొదురుపాకలో మిడ్ మానేరు నిర్వాసితుల నుంచి నిరసన సెగ తగిలింది. శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నిర్వహించిన రోడ్ షోకు కరీంనగర్ నుంచి వెళ్తుండగా కొదురుపాక వద్ద గ్రామస్తులకు కేసీఆర్ అభివాదం చేశారు. ఇదే టైమ్​లో గ్రామానికి చెందిన మిడ్ మానేరు నిర్వాసితులు ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. మిడ్ మానేరు ముంపు గ్రామాల సమస్యలు పట్టించుకోలేదని నిర్వాసితులు కాన్వాయ్ కు ఎదురుగా వచ్చారు. అధికారంలో ఉన్నప్పుడు వేములవాడ రాజన్న సాక్షిగా మిడ్ మానేరు నిర్వాసితులకు ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల నాలుగు వేలు ఇస్తా అని హామీ ఇచ్చి మోసం చేశారన్నారు. ఇప్పటికైనా ప్రతిపక్ష నాయకుడిగా మిడ్ మానేరు నిర్వాసితులకు ప్రభుత్వం నుంచి రూ.5 లక్షల నాలుగు వేలు వచ్చేలా అసెంబ్లీలో మాట్లాడాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ కాన్వాయ్ వెళ్లిపోయాక బీఆర్ఎస్ నాయకులు నిర్వాసితులతో వాగ్వాదానికి దిగారు.