Virat Kohli: కోహ్లీ గొప్ప బ్యాటర్.. అతన్ని ఆడమని బలవంతం చేయకూడదు: రాయుడు

Virat Kohli: కోహ్లీ గొప్ప బ్యాటర్.. అతన్ని ఆడమని బలవంతం చేయకూడదు: రాయుడు

ద్వైపాక్షిక సిరీస్‌లు, ఐసీసీ టోర్నీలు లేని సమయంలో జాతీయ జట్టు క్రికెటర్లు దేశవాళీ క్రికెట్ ఆడాలన్నది బీసీసీఐ కొత్త నిబంధన. ఎంత పెద్ద స్టార్ అయిన అంతర్జాతీయ టోర్నీలు లేనప్పుడు దేశవాళీ క్రికెట్ ఆడాల్సిందే. ఈ నిబంధనను బీసీసీఐ తప్పనిసరి చేయడంతో.. బోర్డర్- గవాస్కర్ ట్రోఫీ ముగియగానే భారత క్రికెటర్లు రంజీల బాట పట్టారు. భారత కెప్టెన్ రోహిత్ శర్మ, యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ముంబై జట్టు తరుపున బరిలోకి దిగగా.. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఢిల్లీ తరుపున రంజీ మ్యాచ్ ఆడాడు.

వీరు ఆడుతున్నారనే పేరు తప్ప.. స్థాయికి తగ్గ ఆటాడిన స్టార్ ఏ ఒక్కరు లేరు. దేశవాళీ బౌలర్లను ధీటుగా ఎదుర్కోలేకపోయారు. జమ్మూ & కాశ్మీర్ తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్.. రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి 31 పరుగులు చేశాడు. ఇక కోహ్లీ విషయానికొస్తే.. దాదాపు పదమూడేళ్ల తరువాత రంజీ ఆడిన ఈ స్టార్ బ్యాటర్.. 6 పరుగులు చేశారు. బహుశా..! ఇందుకేనేమో.. విరాట్ రంజీలు ఆడాల్సిన అవసరం లేదని తెలుగు మాజీ క్రికెటర్ రాయుడు సర్టిఫికెట్ ఇచ్చాడు. 

టన్నుల కొద్దీ పరుగులు, పదుల సంఖ్యలో సెంచరీలు చేసిన కోహ్లీ.. రంజీలు ఆడి నిరూపించుకోవాల్సిన అవసరం లేదని రాయుడు అన్నాడు. తనకు కావాల్సిందల్లా కొంత సమయమని, అతనికి ఆ స్వేచ్ఛనిస్తే చాలని కోహ్లీకి మద్దతు పలికాడు.

"విరాట్ కోహ్లీకి రంజీలు ఆడాల్సిన అవసరం లేదు. అతని టెక్నిక్ అద్భుతం. 81 సెంచరీలు చేశాడు. ఎవరూ తనని ఆడమని బలవంతం చేయకూడదు. అతన్ని నమ్మండి.. అతన్ని గౌరవించండి. ఒంటరిగా వదిలేయండి. అతడే పుంజుకుంటాడు.." రాయుడు ట్వీట్ చేశాడు.

రాయుడు చెప్పేది నిజమే అయినప్పటికీ, గతేడాది నుండి సుదీర్ఘ ఫార్మాట్‌లో కోహ్లి గణాంకాలు ఆశాజనకంగా లేవు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో కోహ్లి 5 మ్యాచ్‌ల్లో 190 పరుగులు చేశాడు.