12 ఏళ్ళ తర్వాత విరాట్ కోహ్లీ రంజీ ట్రోఫీ ఆడడంతో ఫ్యాన్స్ అతన్ని చూసేందుకు భారీ సంఖ్యలో హాజరయ్యారు. గురువారం (జనవరి 30) సూరజ్ అహుజా రైల్వేస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 12 ఏళ్ల తర్వాత ఫస్ట్ క్లాస్ టోర్నమెంట్లో కోహ్లీ తొలిసారిగా మైదానంలోకి దిగాడు. ఎంట్రీ ఫ్రీ కావడంతో కోహ్లీ బ్యాటింగ్ ఎలాగైన చూడాలని ఫ్యాన్స్ వేల సంఖ్యలో తరలి వచ్చారు. కిక్కిరిసిన జనంతో స్టేడియం అంతా నిండిపోయింది ఈ క్రమంలో న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వెలుపల గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ గందరగోళంలో ముగ్గురు వ్యక్తులు గాయపడినట్టు సమాచారం.
16 వ గేట్ లోపల ప్రేక్షకులు ఒకరినొకరు తోసుకుంటున్నప్పుడు గాయాలయ్యాయి. ఎంట్రీ గేట్ వద్ద ఇద్దరు అభిమానులు గాయపడినట్టు సమాచారం. ఒక పోలీసు బైక్ ధ్వంసం కాగా.. కొంతమంది వారి బూట్లు వదిలి వెళ్లారు. గాయపడిన అభిమానులకు గేటు దగ్గర డీడీసీఏ సెక్యూరిటీ, పోలీసులు చికిత్స అందించారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నంలో సెక్యూరిటీ గార్డు కూడా గాయపడ్డాడు. 16 వ గేట్ తెరవడానికి వేచి ఉన్న సమయంలో ఒకరినొకరు నెట్టుకోవడం.. లాగడం లాంటి సంఘటనలు జరగడంతో చాలా మంది యువ అభిమానులు అసౌకర్యానికి గురయ్యారు.
ALSO READ : Virat Kohli: నెక్స్ట్ లెవల్లో కోహ్లీ క్రేజ్.. అభిమానులతో నిండిపోయిన అరుణ్ జైట్లీ స్టేడియం
ఒకానొక సమయంలో ఒక భద్రతా అధికారి అభిమానులను వేరే గేట్ వద్దకు వెళ్లాలని సూచించాడు. మొదట్లో, గౌతమ్ గంభీర్ స్టాండ్ మాత్రమే అందుబాటులో ఉండాలని భావించారు. అయితే అదనపు ప్రేక్షకులకు వసతి కల్పించేందుకు బిషన్ సింగ్ బేడీ స్టాండ్ కూడా తెరవబడింది. ఢిల్లీ క్రికెట్ నిర్వాహకులు ఇంత పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు వస్తారని ఊహించలేదని చెప్పారు. కోహ్లీ కోసం మ్యాచ్ చూసేందుకు ఉదయం 4 గంటల నుండే అభిమానులు అరుణ్ జైట్లీ స్టేడియం వెలుపల క్యూ కట్టడం విశేషం. అరుణ్ జైట్లీ స్టేడియం మొత్తం కోహ్లీ ఫ్యాన్స్ తో నిండిపోవడం విశేషం.