T20 World Cup 2024: కోహ్లీతో జాగ్రత్త.. పాక్ ఆటగాళ్లను హెచ్చరించిన మాజీ కెప్టెన్

T20 World Cup 2024: కోహ్లీతో జాగ్రత్త.. పాక్ ఆటగాళ్లను హెచ్చరించిన మాజీ కెప్టెన్

జూన్ 1 నుంచి అమెరికా, వెస్టిండీస్ దేశాల వేదికగా టీ20 ప్రపంచ కప్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ మెగా టోర్నీలో విజేతగా నిలిచి.. వన్డే ప్రపంచ కప్ పరాభవాన్ని తుడిచివేయాలని చూస్తోంది.. రోహిత్ సేన.  భారత జట్టు తమ తొలి మ్యాచులో జూన్ 05న ఐర్లాండ్‌తో తలపడనుండగా.. జూన్ 9న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను ఢీకొట్టనుంది. ఈ క్రమంలో ఆ జట్టు ఆటగాళ్లకు మాజీ కెప్టెన్ మిస్బా ఉల్ హక్ హెచ్చరికలు పంపాడు. ఇతర ఆటగాళ్లను విస్మరించిన పర్లేదు కానీ, కోహ్లీతో పట్ల జాగ్రత్తగా ఉండాలని బాబర్ ఆజం సేనకు సూచించాడు. 

జాగ్రత్త...!!

పాక్‌తో తలపడినప్పుడల్లా కోహ్లీ సాధారణం కంటే ఎక్కువ ఛార్జ్ అవుతాడని తెలిపిన మిస్బా, అతను మానసికంగా దెబ్బతీస్తాడని హెచ్చరించాడు. న్యూయార్క్‌లో కోహ్లీని త్వరగా అవుట్ చేస్తే పాకిస్థాన్‌కు గెలిచే అవకాశాలు మెండుగా ఉంటాయని నొక్కి చెప్పాడు. అదే సమయంలో 2017లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో మహ్మద్ అమీర్ కోహ్లీని 5 పరుగులకే అవుట్ చేసిన సందర్భాన్ని గుర్తుచేసుకున్నాడు. 

"పాకిస్థాన్‌పై విరాట్ కోహ్లికి మానసికంగా ఆధిపత్యం ఎక్కువ. పాక్‌తో మ్యాచ్ అనగానే మరింత ఆత్మవిశ్వాసంతో కనిపిస్తాడు. చాలా ఎక్కువ ఛార్జ్ అవుతాడు. ఆటగాళ్లకు కావాల్సింది అదే. అతను టాప్-క్లాస్ క్రికెటర్. ఒత్తిడికి గురి కాకుండా ఆడటం అతనికి వెన్నతో పెట్టిన విద్య. అలాంటి ఆటగాడిని వీలైనంత త్వరగా పెవిలియన్ చేర్చాలి. పాకిస్తాన్ అయినా.. మరే ఇతర జట్టైన అతన్ని ఆరంభంలోనే ఔట్ చేయాలి. అందుకు పలు రకాల వ్యూహాలు రచించాలి.." అని మిస్బా చెప్పుకొచ్చాడు.

టీ20ల్లో పాకిస్థాన్‌పై కోహ్లీ.. 10 మ్యాచ్‌ల్లో 488 పరుగులు చేశాడు. ఇందులో 5 అర్ధసెంచరీలు ఉన్నాయి. సగటు 81.33గా ఉంది. 2022 టీ20 ప్రపంచ కప్‌లో పాక్ పై అతను ఆడిన ఇన్నింగ్స్.. అత్యుత్తమ టీ20 నాక్‌లలో ఒకటి. ప్రస్తుతం విరాట్ మరింత ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పటివరకూ 13 మ్యాచ్‌ల్లో 661 పరుగులు చేశాడు. దీంతో అతని పట్ల జాగ్రత్తగా ఉండాలని మిస్బా సూచించడంలో సందేహం లేదు.