ఢిల్లీ రంజీ టీమ్​లో కోహ్లీ..

ఢిల్లీ రంజీ టీమ్​లో కోహ్లీ..

న్యూఢిల్లీ : టీమిండియా సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ పుష్కరకాలం తర్వాత రంజీ ట్రోఫీలో రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఈ నెల 30 నుంచి రైల్వేస్‌‌‌‌తో జరిగే చివరి లీగ్ మ్యాచ్‌‌‌‌లో పోటీ పడే ఢిల్లీ రంజీ జట్టులో విరాట్ కోహ్లీ పేరును డీడీసీఏ సోమవారం అధికారికంగా చేర్చింది. గత మ్యాచ్‌‌‌‌లో బరిలోకి దిగిన రిషబ్ పంత్ ఈ పోరుకు అందుబాటులో ఉండటం లేదు. ఈ మ్యాచ్ కోసం కోహ్లీ మంగళవారం నుంచి అరుణ్ జైట్లీ స్టేడియంలో ప్రాక్టీస్‌‌‌‌ చేయనున్నాడు. విరాట్ కోహ్లీని చూసేందుకు స్థానిక అభిమానులు భారీ సంఖ్యలో వచ్చే అవకాశం ఉండటంతో స్టేడియంలో భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు.

ఈ మ్యాచ్ కోసం స్టేడియంలోని మూడు స్టాండ్లలో అభిమానులను అనుమతిస్తున్నట్టు డీడీసీఏ తెలిపింది. కోహ్లీ బరిలోకి దిగుతున్నప్పటికీ మ్యాచ్‌‌‌‌ను బీసీసీఐ లైవ్ టెలికాస్ట్ చేయడం లేదు. మరోవైపు కేఎల్‌‌‌‌ రాహుల్ కర్నాటక ఆడే చివరి లీగ్ మ్యాచ్‌‌‌‌లో పోటీపడనున్నాడు. కానీ, మేఘాలయాతో ముంబై ఆడే చివరి పోరుకు స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్‌‌‌‌, శ్రేయస్ అయ్యర్ అందుబాటులో ఉండటం లేదు.  ఇంగ్లండ్‌‌‌‌తో వన్డే సిరీస్‌‌‌‌కు రెడీ అవ్వాల్సిన నేపథ్యంలోఈ మ్యాచ్‌‌‌‌లో ముగ్గురు ప్లేయర్లు ఆడే అవకాశం లేదని ముంబై వర్గాలు తెలిపాయి.