ఉప్పల్ వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో సన్ రైజర్స్ బౌలర్లు విఫలమయ్యారు. దీంతో బెంగళూరు భారీ స్కోర్ చేసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. ఫాఫ్ డుప్లెసిస్, కోహ్లీ ఆర్సీబీకు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. తొలి వికెట్ కు 3. 5 ఓవర్లలోనే 48 పరుగులు జోడించారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని నటరాజన్ విడదీసాడు. 12 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్సర్ తో 25 పరుగులు చేసి కెప్టెన్ డుప్లెసిస్ ఔటయ్యాడు.
మూడో స్థానంలో వచ్చిన విల్ జాక్స్ మరోసారి విఫలమయ్యాడు. 9 బంతుల్లో 6 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ దశలో జట్టును ఆదుకునే బాధ్యతను విరాట్ కోహ్లీ, రజత్ పటిదార్ తీసుకున్నారు. ఓ ఎండ్ లో విరాట్ ఆచితూచి బ్యాటింగ్ చేస్తుంటే మరో ఎండ్ లో పటిదార్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 20 బంతుల్లోనే 2 ఫోర్లు, 5 సిక్సర్లతో 50 పరుగులు చేసి ఔటయ్యాడు. మరికాసేపటికీ 51 పరుగులు చేసిన కోహ్లీ పెవిలియన్ బాట పట్టాడు. గ్రీన్ చివరి వరకు క్రీజ్ లో ఉండడంతో జట్టు స్కోర్ 200 పరుగుల మార్క్ దాటింది. సన్ రైజర్స్ బౌలర్లలో ఉనాద్కట్ మూడు వికెట్లు తీసుకోగా.. నటరాజన్ రెండు వికెట్లు పడగొట్టాడు.