వెలుగు స్పోర్ట్స్ డెస్క్:విరాట్ కోహ్లీ, చతేశ్వర్ పుజారా, రోహిత్ శర్మ. టీమిండియా స్టార్లు. టెస్టు క్రికెట్‌లో టీమ్ బ్యాటింగ్ వెన్నుదన్నుగా నిలిచిన ఈ ముగ్గురూ తమ ఆటతో జట్టుకు ఎన్నో విజయాలు అందించారు. కానీ, ఇప్పుడు వీళ్లు కెరీర్ చివరి స్టేజ్‌లోకి వచ్చేశారు. కొన్నాళ్లుగా తడబడుతున్న ఈ ‘బిగ్3’ తప్పుకుంటే ఇండియా టెస్టు టీమ్ బ్యాటింగ్ ఎలా ఉంటుందన్నది ప్రశ్నార్థకంగా మారింది. ముఖ్యంగా వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్లో ఫెయిల్యూర్ తర్వాత ఈ ప్రశ్నకు తక్షణమే సమాధానం వెతకాల్సిన అవసరం ఏర్పడింది. వచ్చే నెలలోనే మరో డబ్ల్యూటీసీ ఎడిషన్ మొదలవనున్న నేపథ్యంలో ఈ ముగ్గురు గాడిలో పడతారా? లేక వీరి స్థానాలను భర్తీ చేసేందుకు కొత్త ఆటగాళ్ల వైపు చూడాలా? అన్నది చర్చనీయాంశమైంది.
పుజారాకు కష్టకాలం
టెస్టు స్పెషలిస్ట్ పుజారా ఫ్యూచర్‌పై అనుమానాలు మొదలయ్యాయి. కౌంటీ క్రికెట్ ఆడిన చతేశ్వర్.. ఓవల్‌లో ఆస్ట్రేలియాపై తీవ్రంగా నిరాశ పరిచాడు. గతేడాది చిన్న జట్టు బంగ్లాదేశ్‌పై చేసిన 90, 102 స్కోర్లను పక్కనబెడితే 2021 సిడ్నీలో ఆస్ట్రేలియాపై చేసిన 77 రన్స్ అతని చివరి చిరస్మరణీయ ఇన్నింగ్స్ అనొచ్చు. వాస్తవానికి, పుజారా 2021-2023 డబ్ల్యూటీసీ సైకిల్‌లో 17 టెస్టుల్లో పాల్గొని 32 సగటుతో 928 రన్స్ చేశాడు. ఇందులో ఒకే సెంచరీ ఉంది. టెస్టు ఫార్మాట్‌లో ఎంతో కీలకమైన మూడో నంబర్ బ్యాటర్ నుంచి ఇది పేలవ పెర్ఫామెన్స్. మరి, అతడిని పక్కనబెడితే మూడో నంబర్‌లో ఆడేది ఎవరు? అంటే ముందుగా హైదరాబాదీ హనుమ విహారి పేరు వస్తుంది. 2022 ప్రారంభంలో శ్రీలంకతో సొంతగడ్డపై జరిగిన సిరీస్‌లో విహారిని ఈ ప్లేస్‌లో ట్రై చేయగా అతను మూడు ఇన్నింగ్స్‌ల్లో ఒక ఫిఫ్టీతో తిరిగొచ్చాడు. కానీ, అదే ఏడాది చివర్లో బంగ్లాదేశ్ పర్యటనలో పుజారా తిరిగి రావడంతో మేనేజ్‌మెంట్ ఆ ప్లాన్‌ను ప్రస్తుతానికి విరమించుకున్నట్లు కనిపించింది. దాంతో, ప్రస్తుతానికి ఈ నంబర్‌లో ఆడే సత్తా ఉన్న ఆటగాడు మరొకడు కనిపించడం లేదు.
కోహ్లీదీ అదే దారి
నాలుగో నంబర్‌లోనూ ఇలాంటి సమస్యే వెంటాడుతోంది. ఆ సమస్యకు విరాట్ కోహ్లీ కారణం కావడం శోచనీయం. ఆధునిక క్రికెట్‌లో సూపర్ స్టార్ ఇమేజ్ ఉన్న విరాట్ దాదాపు పదేండ్ల పాటు అన్ని ఫార్మాట్లలో, అన్ని దేశాల బౌలర్లపై, అన్ని చోట్లా ఆధిపత్యం చెలాయించాడు. కానీ, తనకెంతో ఇష్టమైన టెస్టు ఫార్మాట్‌లో అతనిప్పుడు ఇక్కట్లు పడుతున్నాడు. గత డబ్ల్యూటీసీ సైకిల్‌లో కోహ్లీ 17 టెస్టులు ఆడి 932 రన్స్ చేశాడు. సగటు 32.13 మాత్రమే. ఈ టైమ్‌లో విదేశాల్లో అతని సగటు 24.43కి పడిపోయింది. వచ్చే నెలలో వెస్టిండీస్ టూర్‌తో మొదలయ్యే తర్వాతి డబ్ల్యూటీసీ (2023–25) సైకిల్‌లో టీమిండియాకు కోహ్లీలోని సిసలైన టెస్టు బ్యాటర్ అవసరం. అతను గాడిలో పడకుంటే టెస్టుల్లో నంబర్ 4 బ్యాటర్ ఎవరు? అంటే ప్రస్తుతం గాయంతో టీమ్‌కు దూరమైన శ్రేయస్ అయ్యర్ ఏదో ఒక దశలో ఆ స్థానంలోకి వస్తాడని ఆశించొచ్చు. కానీ, ఆల్‌రౌండ్ ప్లేయర్ అనిపించుకోవాలంటే ఈ ముంబైకర్ చాలా మెరుగవ్వాలి. ముఖ్యంగా షార్ట్ పిచ్ బాల్ వీక్‌నెస్ నుంచి బయటపడాలి. డొమెస్టిక్‌లో అదరగొడుతున్నసర్ఫరాజ్ ఖాన్‌ను కూడా నాలుగో నంబర్‌లో ట్రై చేయొచ్చు. కానీ, హై క్వాలిటీ ఫాస్ట్ బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో అతని టెక్నిక్‌పై అనుమానాలున్నాయి. అలాగే, ఇండియా–ఎ టీమ్ తరఫున ఏడు టెస్టుల్లో ఆడిస్తే ఒక్క సెంచరీ కూడా చేయలేకపోవడం అతనికి మైనస్ అవుతోంది.
రోహిత్ పయనం ఎందాక?
ఇప్పటికే 50 టెస్టులు ఆడినప్పటికీ ఈ ఫార్మాట్‌లో ఇండియా బ్యాటింగ్ లెజెండ్స్‌లో కెప్టెన్రోహిత్ పేరు చర్చకు రాదు. గత డబ్ల్యూటీసీలో మాత్రం తను సత్తా చాటాడు. 11 టెస్టులు ఆడిన హిట్ మ్యాన్ రెండు సెంచరీలు, 42.11 సగటుతో 758 రన్స్ చేశాడు. ఈ టైమ్ లో ఫారిన్‌లో కూడా రాణించాడు. కానీ, అసలైన ఫైనల్లో మాత్రం ఫెయిలయ్యాడు. 36 ఏండ్ల రోహిత్ 2025 వరకు టీమ్‌లో ఉండగలడా? అన్నది ప్రశ్నార్థకమైంది. టెస్టుల్లో ఇన్నింగ్స్ ఓపెనింగ్ బాధ్యతను మోసేందుకు శుభ్‌మన్ గిల్ రెడీగా ఉన్నాడు. కానీ, రోహిత్ వైదొలిగితే అతనికి సరైన పార్ట్‌నర్ కావాలి. మయాంక్ అగర్వాల్ లాంగ్ టర్మ్ ఓపెనర్ అవుతాడని జట్టు భావించింది. కానీ, ఏడాదిగా టెస్టులకు దూరంగా ఉన్నాడు. డొమెస్టిక్‌లో సత్తా చాటుతున్న అభిమన్యు ఈశ్వరన్, యశస్వి జైస్వాల్‌ను పరీక్షిస్తే మంచిది. వచ్చే ఏడాది ఇంగ్లండ్, ఆస్ట్రేలియా రూపంలో టీమ్‌కు ముఖ్యమైన సిరీస్‌లు ఉన్నాయి. పెద్ద జట్లతో ఆడేటప్పుడు ఒకేసారి జట్టులో సమూల ప్రక్షాళన చేయడం సాధ్యం కాబోదు. పైగా,
కొన్నేళ్లుగా టీమ్ మూలస్తంభాలుగా ఉన్న కోహ్లీ, పుజారా, రోహిత్ స్థానాలను భర్తీ చే యడం చాలా కష్టం. అయితే, జట్టులోని అన్ని స్థానాలకు బ్యాకప్స్, రీప్లేస్‌మెంట్స్ అవసరం. కాబట్టి టీమ్ మేనేజ్‌మెంట్ వచ్చే నెల వెస్టిండీస్ టూర్‌లోనే కొందరు యువ ఆటగాళ్లను పరీక్షిస్తే మంచిది.