
ఐపీఎల్ 2025లో ఆదివారం (ఏప్రిల్ 27) రాత్రి జరగనున్న హై ఓల్టేజ్ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టేబుల్ టాప్ లేపేందుకు అమీతుమీ తేల్చుకోనున్నారు. చెరో ఆరు విజయాలతో జోరు మీదున్న ఈ ఇరు జట్లు నేడు గెలిస్తే 14 పాయింట్లతో అగ్ర స్థానంలోకి దూసుకెళ్తుంది. దాంతో ఈ సమ ఉజ్జీల సమరంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ పోరులో విరాట్ కోహ్లీ–కేఎల్ రాహుల్, మిచెల్ స్టార్క్– జోష్ హేజిల్‌వుడ్ మధ్య పోటీపై అందరి ఫోకస్ ఉండనుంది. ఈ మ్యాచ్ లో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన సొంతగడ్డ ఢిల్లీలో ఐపీఎల్ లో ఆల్ టైమ్ రికార్డ్ బద్దలు కొట్టేందుకు సిద్ధంగా ఉన్నాడు.
ఐపీఎల్ లో ఒకే జట్టుపై అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ వార్నర్ ఉన్నాడు. పంజాబ్ కింగ్స్ పై వార్నర్ 26 ఇన్నింగ్స్ ల్లో 1134 పరుగులు చేశాడు. ఈ ఆసీస్ ఓపెనర్ తర్వాత విరాట్ కోహ్లీ 1104 పరుగులతో పంజాబ్ కింగ్స్ పై రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. పంజాబ్ తో ఇక మ్యాచ్ లు లేవు కనుక విరాట్ ఈ సీజన్ లో ఈ రికార్డ్ బ్రేక్ చేయలేడు. అయితే ఢిల్లీ క్యాపిటల్స్ పై కోహ్లీ ఇప్పటివరకు 29 ఇన్నింగ్స్ ల్లో 1079 పరుగులు చేశాడు. నేడు జరగనున్న మ్యాచ్ లో 58 పరుగులు చేసినట్టయితే వార్నర్ ను అధిగమించి ఒకే జట్టుపై అత్యధిక పరుగులు చేసిన రికార్డ్ విరాట్ తన ఖాతాలో వేసుకుంటాడు.
►ALSO READ | School Cricket: ఇది సెలెబ్రేషన్ కాదు.. ఊర మాస్ ర్యాగింగ్: రనౌట్ ముందు యువ క్రికెటర్లు భాంగ్రా డ్యాన్స్
తొమ్మిది మ్యాచ్‌ల్లో ఆరు విజయాలు సాధించిన ఆర్సీబీ అందులో ఐదు ప్రత్యర్థి వేదికల్లోనే అందుకుంది. సొంతగడ్డపై మూడు పరాజయాల తర్వాత గత పోరులో గెలిచి మరింత జోష్‌లోకి వచ్చింది. ఇక, ఐదు ఫిఫ్టీలు కొట్టిన ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లీ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. పైగా, ఢిల్లీ తన స్వస్థలం. చిన్నప్పటి నుంచి ఆడిన కోట్లా గ్రౌండ్‌లో కోహ్లీ తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తాడని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఈ సీజన్ లో కోహ్లీ ఇప్పటివరకు 9 ఇన్నింగ్స్ ల్లో 392 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల లిస్ట్ లో సాయి సుదర్శన్ తర్వాత రెండో స్థానంలో ఉన్నాడు.