పెర్త్ టెస్టులో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సెంచరీతో సత్తా చాటాడు. మూడో రోజు ఆటలో భాగంగా ఆస్ట్రేలియా బౌలర్లపై ఆధిపత్యం చూపిస్తూ పరుగుల వరద పారించాడు. కంగారూల బౌలింగ్ దళాన్ని అలవోకగా ఆడుతూ 143 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కోహ్లీ ఇన్నింగ్స్ లో 8 ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. ఓవరాల్ గా కోహ్లీ కెరీర్ లో ఇది 81 వ సెంచరీ. టెస్టుల్లో విరాట్ కు ఇది 30వ సెంచరీ. ఈ సెంచరీతో కోహ్లీ టెస్టుల్లో దిగ్గజ క్రికెటర్ డాన్ బ్రాడ్‌మన్‌ను దాటేశాడు.
బ్రాడ్‌మన్ టెస్టుల్లో 29 సెంచరీలు చేయగా.. కోహ్లీ 30 సెంచరీలతో అతన్ని అధిగమించాడు. కోహ్లీ 16 నెలల తర్వాత టెస్టుల్లో శతకం బాదడం విశేషం. ఆస్ట్రేలియాలో కోహ్లీకి ఏడో శతకం. కంగారుల గడ్డపై అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా విరాట్ రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు ఈ రికార్డు సచిన్ టెండూల్కర్ (6 సెంచరీలు) పేరిట ఉండేంది. ఈ సెంచరీతో సచిన్ రికార్డును కోహ్లీ బ్రేక్ చేశాడు.
ఈ మ్యాచ్ విషయానికి వస్తే తొలి టెస్టులో ఆస్ట్రేలియాకు టీమ్ఇండియా 534 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఓవర్‌నైట్ స్కోరు 172/0తో మూడో రోజు ఆటను కొనసాగించిన భారత్.. రెండో ఇన్నింగ్స్‌ను 487/6 స్కోరు వద్ద డిక్లేర్డ్ చేసింది. యశస్వి జైస్వాల్ (161) దంచికొట్టగా.. విరాట్ కోహ్లీ (100*; 143 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీతో ఆకట్టుకున్నాడు. కేఎల్ రాహుల్ (77) పరుగులు చేశాడు. నితీశ్ రెడ్డి (38; 27 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఆకట్టుకున్నాడు. ఆసీస్ బౌలర్లలో నాథన్ లైయన్ రెండు, స్టార్క్, హేజిల్‌వుడ్, కమిన్స్, మిచెల్ మార్ష్ తలో వికెట్ పడగొట్టారు.