నా అసలు ఆట అప్పుడే మొదలైంది.. IPL ప్రస్తానంపై కోహ్లీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

నా అసలు ఆట అప్పుడే మొదలైంది.. IPL ప్రస్తానంపై కోహ్లీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

న్యూఢిల్లీ: టీమిండియా స్టార్, ఆర్సీబీ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన ఆట గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. అహంకారాన్ని నియంత్రించటం, మ్యాచ్ పరిస్థితులకు తగ్గట్టుగా ఆడటమే తన బ్యాటింగ్‌‌ మూల సిద్ధాంతమని చెప్పాడు.  ‘నా బ్యాటింగ్‎లో అహంకారానికి స్థానం లేదు. ఎదుటి వారిని మించిపోవాలన్న ఉద్దేశం కూడా నాలో ఎప్పుడూ ఉండదు. 

మ్యాచ్‌‌ పరిస్థితిని అర్థం చేసుకోవడమే నాకు మొదటి ప్రాధాన్యం. అదే విషయాన్ని నేను గర్వంగా భావిస్తా. అప్పటి పరిస్థితి ఏం కోరుతుందో దానికి అనుగుణంగా ఆడాలనే చూస్తాను. నేను  రిథమ్‌‌లో, ఫ్లోలో ఉన్నప్పుడు సహజంగానే మొదటి అడుగు వేసి ఆటకు ఊపు తీసుకురావాలని చూస్తా. కానీ మరెవరైనా ఆ సమయంలో మెరుగ్గా ఆడుతుంటే వాళ్లను ప్రోత్సహిస్తా’ అని కోహ్లీ పేర్కొన్నాడు.  

ఐపీఎల్‌‌లో కోహ్లీ ఇప్పటివరకు 8,168  రన్స్ చేసి, ఎనిమిది సెంచరీలు సాధించాడు. ఇవన్నీ లీగ్‌‌ రికార్డులే. ఈ క్రమంలో ఐపీఎల్‌‌లో తన ప్రయాణాన్ని కోహ్లీ గుర్తు చేసుకున్నాడు. ‘ఆర్సీబీతో తొలి మూడు సీజన్లలో నాకు టాపార్డర్‌‌లో ఆడే అవకాశం ఎక్కువ రాలేదు. అప్పట్లో నన్ను లోయర్ ఆర్డర్‌‌‌‌లో ఆడించేవారు. అందువల్ల నేను ఐపీఎల్‌‌ను పెద్దగా అర్థం చేసుకోలేకపోయాను. కానీ, 2010 నుంచి నేను నిలకడగా ఆడటం మొదలు పెట్టా. 2011కు వచ్చే సరికి రెగ్యులర్‌‌‌‌గా మూడో స్థానంలో ఆడుతున్నా. అప్పటి నుంచే ఐపీఎల్‌‌లో నా అసలైన ప్రయాణం మొదలైంది’ అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.

18 ఏండ్ల పాటు ఈ లీగ్‌‌లో ఆడటం వల్ల టీ20 ఫార్మాట్‌‌లో తన స్కిల్స్‌‌ మెరుగుపరుచుకునే అవకాశం లభించిందన్నాడు. ‘ఐపీఎల్ ఆటగాడికి ప్రత్యేకమైన సవాల్ విసురుతుంది. ఈ టోర్నమెంట్ స్వభావమే భిన్నం. ఇది చిన్న సిరీస్‌‌లా రోజుల్లో ముగియదు. కొన్ని వారాల పాటు సాగుతుంది. పాయింట్స్ టేబుల్‌‌లో మన జట్టు స్థానమూ మారుతుంటుంది. అది మనపై పలు రకాల ఒత్తిడిని తీసుకువస్తుంది. ఈ డైనమిక్ స్వభావం మిగిలిన ఫార్మాట్‌‌ల కంటే  మనల్ని మానసికంగా, శారీరకంగా సవాల్ చేస్తుంది. ఈ లీగ్ నా  టీ20 నైపుణ్యాలను నిరంతరం మెరుగుపరుచుకునేలా ప్రేరణనిచ్చింది’ అని కోహ్లీ పేర్కొన్నాడు.