కోయిల్​సాగర్​ పనులు పూర్తి చేయడంపై దృష్టి పెట్టని సర్కార్

కోయిల్​సాగర్​ పనులు పూర్తి చేయడంపై దృష్టి పెట్టని సర్కార్

మహబూబ్​నగర్, వెలుగు: కోయిల్​సాగర్​ ప్రాజెక్టు రైట్​ కెనాల్​ కింద డిస్ట్రిబ్యూటరీలు, పిల్ల కాల్వలు, స్ట్రక్చర్ల పనులు ఏడియాడనే ఉన్నాయి. తెలంగాణ ఏర్పాటు తర్వాత పెండింగ్​ పనులను టేకప్​ చేయడం లేదు. దీంతో రైట్​ కెనాల్​ పరిధిలో 25 వేల ఎకరాలకు సాగునీరు అందడం లేదు. ఉమ్మడి ఏపీలో అప్పటి సీఎం వైఎస్​ రాజశేఖర్​రెడ్డి 2004–-05లో జలయజ్ఞం కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఇందులో భాగంగా మహబూబ్​నగర్​ జిల్లాలోని కోయిల్​సాగర్​ ప్రాజెక్ట్​ కెపాసిటీని 3.09 టీఎంసీలకు పెంచి, అదనంగా 38,250 ఆయకట్టుకు సాగునీటిని అందించేందుకు కెనాల్స్​ డెవలప్​మెంట్, డిస్ట్రిబ్యూరిటీలు, లింక్​ కెనాల్స్, పిల్ల కాల్వల నిర్మాణం కోసం రూ.360.18 కోట్లు కేటాయించారు. కాంట్రాక్ట్​ దక్కించుకున్న ఐబీఆర్​ సెల్​ కంపెనీ 2014 జూన్​ 2 నాటికి రూ.336.29 కోట్లు ఖర్చు చేసి 93 శాతం పనులను కంప్లీట్​ చేసింది. తెలంగాణ వచ్చాక ఆ కంపెనీని ముసేశారు. అప్పటి నుంచి పెండింగ్​ పనులు అలాగే ఉన్నాయి.

అడుగు ముందుకు పడ్తలే..

కోయిల్​సాగర్​ కింద రైట్​, లెఫ్ట్​ కెనాల్స్​ ఉన్నాయి. ఇందులో రైట్​ కెనాల్​ కింద మాత్రమే లింక్​ కెనాల్​ను ఏర్పాటు చేశారు. ఇది మక్తల్​ నియోజకవర్గంలో ఉండగా, పుట్టగడ్డ -అప్పంపల్లి నుంచి మొదలై చిత్తనూరు వరకు 20 కిలోమీటర్ల పొడవు ఉంది. దీని కింద కన్మనూరు, తండా, ఉందేకోడ్, ఎక్లాస్ పూర్, చిత్తనూరు, కుమార్​లింగంపల్లి గ్రామాల పరిధిలోని 15 వేల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉంది.

అలాగే ఉందేకోడ్​లోని నాలుగు గొలుసుకట్టు చెరువులు, ఎక్లాస్​పూర్, కుమార్​లింగంపల్లి గ్రామాల్లోని చెరువులను నింపాలని డిజైన్​లో ఉంది. కానీ, లింక్​ కెనాల్​ పనులు 2014లోనే పూర్తి చేసినా, పొలాలు, చెరువులకు నీళ్లు పోయేందుకు ఏర్పాటు చేయాల్సిన డిస్ట్రిబ్యూటరీలు, పిల్ల కాల్వల పనులు పెండింగ్​లోనే ఉన్నాయి. 

రూలింగ్​ పార్టీ ఎమ్మెల్యే​ఉన్నా..

లింక్​ కెనాల్​ నుంచి డిస్ట్రిబ్యూటరీలు, పిల్ల కాల్వల పనులు పెండింగ్​లో ఉన్నా ఎమ్మెల్యే​పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. రెండు సార్లు గెలిచినా సీఎం కేసీఆర్​ దృష్టికి తీసుకెళ్లి పనులు పూర్తి చేసేందుకు ఫండ్స్​ తెప్పించడంలో ఫెయిల్ అయ్యారని ప్రజలు అంటున్నారు. లింక్​ కెనాల్​ కింద డిస్ట్రిబ్యూటరీలు, పిల్ల కాల్వల పనులు డిజైన్​ చేసిన చోట అనుచరుల భూములు ఉండడం, అవి ముంపునకు గురవుతుండడంతో పనులు చేయించడం లేదనే విమర్శలు వస్తున్నాయి.

ప్రతిపాదనలు పంపించాం..

కాంట్రాక్ట్​ కంపెనీ మూతపడటంతో పనులు ఆగిపోయాయి. లింక్​ కెనాల్​ కింద డిస్ట్రిబ్యూటరీలు, మైనర్లు, స్ట్రక్చర్​ పనులు పెండింగ్​లో ఉన్నాయి. రూ.75 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. ఆమోదం రాగానే ఫ్రెష్​గా టెండర్లు నిర్వహించి, పనులు ప్రారంభిస్తాం. -గోపాలచారి, డీఈ, కోయిల్​సాగర్​

మూడింతలైన ఎస్టిమేషన్లు..

రూ.360 కోట్ల పనులకు గాను 2014 నాటికి రూ.336 కోట్ల పనులు పూర్తి చేశారు. మిగిలిన రూ.23 కోట్ల పనులు మాత్రమే చేయాల్సి ఉండేది. పనులు దక్కించుకున్న కంపెనీ అదే ఏడాది ఎత్తేయడంతో, పెండింగ్​ పనులు పూర్తి చేయడంపై సర్కారు దృష్టి పెట్టడం లేదు. రూ.23 కోట్లతో 7 శాతం పనులు కంప్లీట్​ చేయకుండా నాన్చడంతో, ఇప్పుడు మిగిలిపోయిన పనుల అంచనా మూడింతలకు పెరిగింది. ఇప్పటికే ఇరిగేషన్​ ఆఫీసర్లు పెండింగ్​ పనులకు సంబంధించి రూ.75 కోట్లతో ప్రభుత్వానికి ఎస్టిమేషన్లు పంపినా, ఆమోదం రాలేదు.