- 45.33 ఎకరాలకు రూ.3,319.60 కోట్ల ఆమ్దానీ
- కనీస ధర రూ.1,586.55 కోట్లు.. వచ్చింది డబుల్
- పోటా పోటీగా బిడ్లు దాఖలు చేసిన రియల్ ఎస్టేట్ కంపెనీలు
- 7 ప్లాట్లుగా విభజించి అమ్మిన హెచ్ఎండీఏ
- 10వ ప్లాటులో ఎకరానికి రూ. 100.75 కోట్లు
- 7వ ప్లాట్‌లో ఎకరం రూ.75.50 కోట్లు
- వచ్చే నెలలో మరిన్ని భూముల వేలం?
హైదరాబాద్ , వెలుగు: భూముల అమ్మకంతో రాష్ట్ర సర్కారుకు భారీగా ఆమ్దానీ సమకూరుతున్నది. హైదరాబాద్ శివారులోని కోకాపేటలో గురువారం వేలం నిర్వహించగా.. ఎకరం రూ.100 కోట్లకు అమ్ముడుపోయింది. ఇది ఆల్‌టైమ్ రికార్డు. గతంలో ఇక్కడ ఎకరా రూ.60 కోట్ల దాకా పలికింది. ఇప్పుడు ఆ రికార్డు బ్రేక్ అయింది. ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్ జిల్లాల్లో ఇప్పటికి చాలాసార్లు హెచ్ఎండీఏ భూములను వేలం వేయగా.. ఇంత హయ్యెస్ట్ధర ఎప్పుడూ పలకలేదు. కోకాపేటలోని నియోపొలిస్ లే ఔట్ ఫేజ్–2 ప్లాట్ల వేలాన్ని గురువారం అమీర్ పేట స్వర్ణజయంతి కాంప్లెక్స్ లో నిర్వహించారు. 45.33 ఎకరాలను 7 ప్లాట్లు (6, 7, 8, 9, 10, 11, 14)గా విభజించి ఆన్ లైన్లో వేలం వేశారు. ఇవి హాట్‌కేకుల్లా అమ్ముడుపోయాయి. మొత్తం 45.33 ఎకరాలకు రూ. 1,586.55 కోట్లు కనీస ధరగా నిర్ణయించగా.. రూ.3,319.60 కోట్ల రెవెన్యూ వచ్చింది. వేలంపాటలో హైదరాబాద్ తో పాటు దేశంలోని పలు రియల్ ఎస్టేట్ కంపెనీలు, విదేశీ కంపెనీలు కూడా పోటా పోటీగా బిడ్లు దాఖలు చేశాయి.
..ఎకరం 100 కోట్లు
ప్లాట్ నంబర్ 10లో 3.60 ఎకరాలు ఉండగా.. ఎకరాకు రూ.100.75 కోట్ల లెక్కన రూ.362.70 కోట్లు చెల్లించి హ్యాపీ హైట్స్ నియోపోలీస్, రాజపుష్ప ప్రాపర్టీస్ కంపెనీలు కొనుగోలు చేశాయి. ప్లాట్ నంబర్ 7లో 6.55 ఎకరాలు ఉండగా.. ఎకరాకు రూ.75.50 కోట్ల చొప్పున రూ.494.53 కోట్లు చెల్లించి నవట్రిస్ ఇన్వెస్ట్ మెంట్స్, రాజపుష్ప ప్రాపర్టీస్ కంపెనీలు కొనుగోలు చేశాయి. ఎమ్మెల్సీ, మాజీ కలెక్టర్ వెంకట్రామ్ రెడ్డికి చెందిన రాజపుష్ప ప్రాపర్టీస్ గత వేలంలోనూ రికార్డు ధరకు భూములను కొనుగోలు చేసింది.
ఎందుకంత క్రేజ్
జంట జలాశయాల రక్షణ కోసం తెచ్చిన జీవో నంబర్ 111ను ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేసింది. కోకాపేట ప్రాంతం 111 జీవో అమలయ్యే ప్రాంతాలకు అతి సమీపంలో ఉంది. ఈ జీవో పరిధిలో వేల ఎకరాల భూములు ఉన్నాయి. ఈ ప్రాంతంలో బడా రియల్ ఎస్టేట్ కంపెనీల ఐటీ టవర్లతో పాటు 30, 40 ఫ్లోర్లు, విల్లాల నిర్మాణం చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. కోకాపేట ప్రాంతం ఓఆర్ఆర్కు దగ్గరగా ఉంది. దీంతో ఈ ప్లాట్లకు క్రేజ్ ఏర్పడింది.
ఫస్ట్ ఫేజ్‌లో 65 ఎకరాలకు రూ.2,700 కోట్లు
కోకాపేట, ఆ పరిసరాల్లో 400 ఎకరాల ప్రభుత్వ భూములను వేలం వేయాలని రాష్ట్ర సర్కారు గతంలో నిర్ణయించింది. వీటికి రూ.400 కోట్లు పెట్టి హెచ్ఎండీఏ ఇన్ఫ్రాను డెవలప్ చేస్తూ, దశలవారీగా వేలం వేస్తున్నది. గురువారంతో రెండు దశల్లో వేలం పూర్తయింది. 2021లో మొదటి దశలో కోకాపేట, ఖానామేట్‌లో 65 ఎకరాల భూములను అమ్మారు. అప్పుడు ఎకర భూమి రూ.60 కోట్ల దాకా అమ్ముడుపోయింది. మొత్తంగా 65 ఎకరాల భూముల అమ్మకంతో రాష్ట్ర ప్రభుత్వానికి రూ.2,700 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. గురువారం నిర్వహించిన సెకండ్ ఫేజ్ వేలంలో రికార్డు స్థాయి ధరకు భూములు అమ్ముడుపోయాయి. దీంతో వచ్చే నెలలో మరిన్ని ఎకరాలను వేలం వేయాలని హెచ్ఎండీఏ భావిస్తున్నట్లు తెలిసింది.
దేశంలోనే హయ్యెస్ట్ రేట్!
గురువారం ఉదయం, మధ్యాహ్నం రెండు దశల్లో హెచ్ఎండీఏ ఆన్ లైన్ వేలం చేపట్టింది. కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎంఎస్టీసీ ( మెటల్ స్క్రాప్ ట్రేడ్ కార్పొరేషన్ లిమిటెడ్ ) ఆధ్వర్యంలో ఇది కొనసాగింది. కనీస ధర ఎకరాకు రూ.35 కోట్లు ఖరారు చేశారు. అయితే, ప్రతి బిడ్‌ను రూ. 25లక్షలు పెంచుకుంటూ వెళ్లాల్సి ఉండగా.. కంపెనీలు పోటీ పడుతూ ధరను పెంచేశాయి. ఇట్లా 10వ ప్లాట్‌లో ఎకరా రూ. 100.75 కోట్లు పలికింది. దేశంలో ఇదే హయ్యెస్ట్ ధర అని రియల్టర్లు చెప్తున్నారు. గతంలో కోల్‌కతాలో ఎకరం రూ.72 కోట్లు పలికిందని గుర్తుచేస్తున్నారు.