హామీలను దశల వారీగా హామీలు అమలు చేస్తాం : కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు

మంచిర్యాల, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల టైమ్​లో ప్రజలకిచ్చిన హామీలను దశల వారీగా అమలు చేస్తామని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు పేర్కొన్నారు. గురువారం ఆయన తన ఇంట్లో మీడియాతో మాట్లాడారు. జిల్లా కేంద్రంలోని ఆర్అండ్ బీ వద్ద ఎంసీహెచ్ ను ఏర్పాటు చేస్తామన్నారు. ఇక్కడ నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కాంప్లెక్స్ పనులు నిలిపేసి అందరికీ అందుబాటులో ఉండేలా హాస్పిటల్ కడతామన్నారు.  

అదనంగా మరో 300 బెడ్స్ హాస్పిటల్ ను ఏర్పాటు చేస్తామన్నారు. మంచిర్యాల తిలక్ నగర్, ఏసీసీ, గోదావరి రోడ్, సాయికుంటలో  శ్మశానవాటికలు నిర్మిస్తామని తెలిపారు. మంచిర్యాలలో డంప్ యార్డు సమస్యను త్వరలోనే పరిష్కరిస్తానని అన్నారు. గూడెం లిఫ్ట్ ద్వారా రెండో  పైపులైన్ తో సాగునీరు సప్లయ్​చేస్తున్నామని చెప్పారు. సంక్రాంతి నుంచి నియోజకవర్గంలోని మూడు మున్సిపాలిటీల్లో రోజుకు రెండు గంటల చొప్పున వాటర్ సప్లయ్​చేస్తామన్నారు.

రైల్వే ఓవర్ బ్రిడ్జిపై రోడ్ రిపేర్లు చేపట్టామని, ఇరువైపుల పూల మొక్కలు, టైల్స్ పనులు జరుగుతున్నాయని అన్నారు. లక్సెట్టిపేటలో తాను చదువుకున్న స్కూల్ రిపేర్ల కోసం ఫండ్స్ శాంక్షన్ చేయించానని తెలిపారు. నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలో ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుని నిరుపేదలకు పంచుతామని చెప్పారు. మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ లపై అవిశ్వాసానికి సహకరించిన కౌన్సిలర్లకు ఆయన కృతఙ్ఞతలు తెలిపారు.