దసరా సెలవుల్లో : యాదాద్రి వెళ్లినప్పుడు.. ఆ పక్కనే ఉంటుంది కొలనుపాక జైన వైభవం

దసరా సెలవుల్లో : యాదాద్రి వెళ్లినప్పుడు.. ఆ పక్కనే ఉంటుంది కొలనుపాక జైన వైభవం

తెలంగాణలో చారిత్రక ఆనవాళ్లుగా పేరొందిన కట్టడాలు చాలా ఉన్నాయి. వీటిలో చాలా కట్టడాలు మంచి శిల్పకళతో, అందమైన నిర్మాణాలతో టూరిస్టులని ఆకట్టుకుంటున్నాయి. కొలనుపాకలోని జైన దేవాలయం కూడా అలాంటిదే. ఈ దేవాలయానికి రెండు వేల ఏండ్ల చరిత్ర ఉంది. యాదాద్రి భువనగిరి జిల్లా, ఆలేరు మండలంలోని కొలనుపాక ఊళ్లో ఉంది ఈ ఆలయం.

దేవాలయంలో మొదటి జైన తీర్థంకరుడైన ఈ రిషభనాథుడి విగ్రహాటితో పాటు నేమినాథుడు, మహవీరుడి విగ్రహాలు ఉంటాయి. రిషభ నాథుడిని 'మాణిక్య దేవ' అని పిలుస్తారు. ప్రధాన ఆలయానికి రెండువైపులా 8 మంది తీర్థంకరుల శిల్పాలు ఉంటాయి. 

130 సెంటీమీటర్ల ఎత్తు ఉన్న మహావీరుని విగ్రహం మరో అట్రాక్షన్. ఈ విగ్రహాన్ని 'జేడ్' అనే రాయితో తయారుచేశారట. 4వ శతాబ్ద కాలంలో తెలంగాణలో జైనమతం బాగా వ్యాప్తిలో ఉండేది. జైనమతానికి మొదటి నుంచి కొలనుపాక ప్రధాన కేంద్రంగా ఉందని చరిత్ర చెబుతోంది. ఈ దేవాలయం కట్టడంలో ఎర్రని ఇసుక రాయిని, పాలరాతి పిల్లర్లని వాడారు. జైన మతంలోని శ్వేతాం బరులకి (తెల్లని దుస్తులు వేసుకునేవాళ్లు) కొలనుపాక ప్రధాన పూజా కేంద్రం.

ఇలా వెళ్లాలి..

యాదాద్రిభువనగిరి నుంచి 34కిలోమీటర్ల దూరంలో ఉంది కొలనుపాక. వరంగల్ నుంచి 80 కిలోమీటర్ల జర్నీ చేస్తే కొలనుపాక చేరుకోవచ్చు. హైదరాబాద్ నుంచి 77 కిలోమీటర్ల దూరం. కొలనుపాక బస్టాండ్ నుంచి జైన దేవాలయానికి ఆటోలు లేదా గుర్రపు బగ్గీల్లో వెళ్లొచ్చు.

టైమింగ్స్..

ఉదయం 6 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు.