కొల్లాపూర్ మామిడి రైతుకు కష్టకాలం .. ప్రారంభానికి నోచుకోని కోల్డ్​ స్టోరేజి

కొల్లాపూర్ మామిడి రైతుకు కష్టకాలం .. ప్రారంభానికి నోచుకోని కోల్డ్​ స్టోరేజి
  • అటకెక్కిన మామిడి మార్కెట్ నిర్మాణ  హామీ 
  • భయపెడుతున్న గాలి దుమారం, అకాల వర్షాలు 

నాగర్​ కర్నూల్, వెలుగు:  కొల్లాపూర్ మామిడి క్రమంగా కనుమరుగవుతోంది.  ఏటా విపరీతంగా పెరుగుతున్న పెట్టుబడి ఖర్చులు, పూత దశ నుంచే వెంటాడే తెగుళ్లు ఇబ్బందులు పెడుతున్నాయి.  పంట చేతికి వచ్చిన తర్వాత గాలి దుమారం, అకాల వర్షాలతో చెట్లు కూలి, కాయలు రాలిపోతున్నాయి. దేశీయంగా గుర్తింపు ఉన్న కొల్లాపూర్​మామిడి అమెరికా, మలేషియా, అరబ్ , యూరప్ దేశాలకు ఎగుమతి అవుతుంది.  కేసరీ, ఆల్పన్, బంగినపల్లి మామిడికి విదేశాల్లో మంచి డిమాండ్  ఉంది. ఎక్కువ తీయదనం, నాణ్యత కొల్లాపూర్ మామిడి ప్రత్యేకత.  ఇక్కడి నేల స్వభావం, నీటి లక్షణాల వల్ల కొల్లాపూర్ మామిడికి  ఎన్నో  ప్రత్యేకతలు ఉన్నాయి. 

అకాల వర్షం, గాలిదుమారంతో ఇబ్బందులు  

ఈ సారి మార్కెట్​లో ధర బాగుందని సంబరపడుతున్న మామిడి  రైతులకు గాలివాన కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ వారంలో కురిసిన అకాల వర్షాలు, గాలి దుమారానికి కొల్లాపూర్ మండలం, బిజినేపల్లి, బల్మూరు మండలాల్లో  కోతకు వచ్చిన మామిడి నేలరాలింది. ​ నాగర్​ కర్నూల్​జిల్లాలో 35 వేల హెక్టార్లలో మామిడి తోటలు ఉండగా ఒక్క కొల్లాపూర్​ నియోజకవర్గంలోనే 25  వేల హెక్టార్లలో మామిడి తోటలు ఉన్నాయి. 

 ఏడాది మొత్తం కష్టపడితే నాలుగు నెలల పాటు వచ్చే మామిడి దిగుబడి అమ్ముకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు.  కొల్లాపూర్​లో స్థానికంగా మామిడి మార్కెట్​ ఏర్పాటు చేయకపోవడంతో అమ్ముకునే సౌకర్యం లేక పట్నం బాట పడుతున్నారు.  కనీస ధర వచ్చే వరకు కాయలు నిల్వ చేసుకునేందుకు కోల్డ్​ స్టోరేజీ ప్లాంట్ నిర్మాణం, గ్రేడింగ్, ప్యాకింగ్​వసతి కల్పిస్తామని ప్రకటించి ఏడేండ్లు దాటినా ఆ పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.

ఊరించిన రేట్లు...

మామిడిపంట చేతికి వచ్చిన మార్చి నెలలో టన్నుకు రూ.1.20 లక్ష నుంచి రూ.1.50 లక్షల వరకు ధర పలికింది.  రాష్ట్రంలోని ఇతర జిల్లాల నుంచి మామిడి పంట మార్కెట్‌‌‌‌లోకి రావడంతో ప్రస్తుతం టన్నుకు రూ.40 వేలకు మించడం లేదు. పడిపోయిన ధరలు, గాలివాన భయం మామిడి రైతులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.  

ఇంటిగ్రేటెడ్​ మ్యాంగో ప్యాకింగ్​ సెంటర్​ ప్రారంభం ఎన్నడో...

2017-–18 ఆర్థిక సంవత్సరంలో రూర్బన్​ స్కీంలో రూ.4.30 కోట్ల అంచనాతో ఇంటిగ్రేటెడ్​ మ్యాంగో ప్యాకింగ్​ హౌజ్​ నిర్మాణానికి కొల్లాపూర్​ నియోజకవర్గంలోని పెద్ద కొత్తపల్లి మండలాన్ని ఎంపిక చేశారు.  స్థలం ఎంపికకు రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం వల్ల మూడేళ్లు పట్టింది.  కార్పాముల గ్రామంలో  2  ఎకరాల ప్రభుత్వ స్థలం కేటాయించారు.  ఇందులో ఇంటిగ్రేటెడ్ ​మ్యాంగో ప్యాక్​ హౌజ్​ ప్లాంట్​నిర్మాణం పనులు ప్రారంభించారు.  సివిల్​ పనులకు రూ. 2.30 కోట్లు, మిషనరీకి రూ.2 కోట్ల పైచిలుకు కేటాయించారు.  

మార్కెటింగ్​ శాఖ ఆధ్వర్యంలో  గోదాముల నిర్మాణం, మరో షెడ్డులో మిషనరీలు ఏర్పాటు చేయాల్సి ఉంది.  కొల్లాపూర్​ మామిడి రైతులు దేశ, విదేశాలకు ఎగుమతి చేయాలనుకునే వివిధ రకాల మామిడి కాయలను గ్రేడింగ్​ చేసి, వాషింగ్, ప్యాకింగ్​అనంతరం ఎక్స్​పోర్ట్​కు అనుమతిస్తారు.  ట్రాన్స్​ఫార్మర్లు బిగిస్తే వచ్చే ఏడాదికైనా కార్పాముల ఇంటిగ్రేటెడ్​ప్యాకింగ్​సెంటర్​అందుబాటులోకి వస్తుంది. స్థానిక రాజకీయ వివాదాల కారణంగా ఈ పనులు సాగక మామిడి రైతులకు తిప్పలు తప్పడం లేదు.  

హామీ ఇచ్చి 15 ఏళ్లు.. అయినా మామిడి మార్కెట్ కట్టలే​ 

 కొల్లాపూర్​లో మామిడి మార్కెట్​ ఏర్పాటు చేస్తామని ప్రజాప్రతినిధులు హామీ ఇచ్చి 15 ఏళ్లు అయిపోయాయి.  గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కొల్లాపూర్​పట్టణ సమీపంలోని రాంపూర్​ వద్ద 8 ఎకరాల ప్రభుత్వ స్థలంలో మామిడి మార్కెట్​ఏర్పాటు చేస్తున్నామని కొబ్బరికాయలు కొట్టిన లీడర్లు ఎన్నికల తర్వాత పత్తా లేకుండా పోయారు. మామిడి మార్కెట్, కోల్డ్​ స్టోరేజీ ప్లాంట్లు, ఇంటిగ్రేటెడ్​ ప్యాకింగ్​సెంటర్​ అందుబాటులోకి వస్తే కొల్లాపూర్​మామిడితో పాటు తోటలపై ఆధారపడిన 15 వేల మంది రైతు కుటుంబాల రెక్కల కష్టానికి ప్రతిఫలం లభిస్తుంది.  

వాతావరణంలో మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో పాటు ప్రభుత్వాల నిర్లక్ష్యం కొల్లాపూర్​ మామిడి రైతులకు శాపంగా మారుతోంది.  తోటలు గుత్తకు తీసుకున్న రైతులు వాహనాల్లో హైదరాబాద్​లోని కోహెడ మార్కెట్​కు తరలిస్తుండగా ఒకటి రెండు ఎకరాల మామిడి తోటల రైతులు స్థానిక వ్యాపారులకు అమ్ముకుంటున్నారు. మార్కెట్​ వసతి, నిల్వ సౌకర్యం కల్పిస్తే కొల్లాపూర్​ మామిడికి పూర్వ వైభవం వస్తుందని స్థానికులు అంటున్నారు.