నంగునూరులో బయటపడిన రాతిపూస
తొలి చారిత్రక యుగానికి చెందినదన్న పరిశోధకులు
సిద్దిపేట రూరల్ (నంగునూర్), వెలుగు : కొత్త తెలంగాణ చరిత్ర బృందం పరిశోధక సభ్యుడు కొలిపాక శ్రీనివాస్ సిద్ధిపేట జిల్లా నంగునూరులో గ్రానైట్ రాతి పూసను గుర్తించారు. ఆయన కథనం ప్రకారం సాధారణంగా పూసలు పురావస్తు ప్రదేశాల్లో టెర్రకొట్ట(మట్టి)వి, రంగురాళ్లతో చేసినవి, ఎముకలతో చేసినవి దొరుకుతుంటాయని, కానీ, గ్రానైట్ రాతితో చేసిన రాతిపూస దొరకడం తెలంగాణలో ఇదే తొలిసారి అని అన్నారు. బంకమట్టితో చేసి కాల్చినవి, పగడం, లాపిస్ లాజులే, అగేట్, పచ్చవంటి విలువైన మణులతో చేసినవి ఇప్పటివరకు దొరికాయని, ఇలాంటి రాతిపూస నంగునూరులో దొరకడం విశేషమన్నారు. గతంలో నంగునూరు పాటిగడ్డమీద బంకమట్టితో చేసిన ఎద్దు తల, టెర్రకొట్ట పూసలు లభించాయన్నారు. ఇది తొలి చారిత్రక యుగానికి అంటే క్రీ.శ. ప్రారంభానికి ముందరిదని ఓ పురావస్తు అధికారి అభిప్రాయపడ్డారని బృందం కన్వీనర్ శ్రీ రామోజు హరగోపాల్ తెలిపారు.
ALSOREAD:హైదరాబాద్, మేడ్చల్ కలెక్టరేట్ల ముట్టడికి యత్నించిన ఎస్ఎఫ్ఐ నేతలు