జూడాల దెబ్బకు దిగొచ్చిన మమతా సర్కార్.. కోల్ కతా సీపీ ఔట్

జూడాల దెబ్బకు దిగొచ్చిన మమతా సర్కార్.. కోల్ కతా సీపీ ఔట్

వెస్ట్ బెంగాల్: కోల్ కతాలోని ఆర్జీ కర్ హస్పిటల్ అండ్ మెడికల్‎ కాలేజ్ లో జూనియర్ వైద్యారాలిపై హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అత్యంత పాశవికంగా జూనియర్ డాక్టర్‎పై అత్యాచారం చేసి హతమార్చారు. దీంతో బాధితురాలికి న్యాయం చేయాలంటూ తోటి జూనియర్ డాక్టర్లు గత కొద్ది రోజులుగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జూనియర్ వైద్యులను బెంగాల్ ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది. ఇవాళ (సెప్టెంబర్ 17) బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, జూడాల మధ్య చర్యలు జరిగాయి. ప్రభుత్వం ముందు జూడాలు పలు కీలకమైన డిమాండ్లు పెట్టినట్లు తెలుస్తోంది.

 కోల్ కతా సీపీ వినీత్ గోయల్, ‎రాష్ట్ర వైద్య విద్య డైరెక్టర్ మరియు డైరెక్టర్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్‌పై చర్యలు తీసుకోవాలని జూడాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు మమతా సర్కార్ అధికారులపై చర్యలకు దిగింది. జూడాల డిమాండ్ మేరకు కోల్ కతా సీపీ వినీత్ గోయల్‎తో పాటు ‎రాష్ట్ర వైద్య విద్య డైరెక్టర్ డాక్టర్ కౌస్తవ్ నాయక్‌,  డైరెక్టర్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్‌గా డాక్టర్ దేబాసిష్ హల్డర్‌‎పై బదిలీ వేటు వేసింది. వీరితో పాటు బాధితురాలి తల్లిదండ్రులకు డబ్బులు ఇస్తానన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న డిప్యూటీ కమిషనర్ (నార్త్ డివిజన్) అభిషేక్ గుప్తాను సైతం ప్రభుత్వం ట్రాన్స్‎ఫర్ చేసింది. 

Also Read:-బుల్డోజర్ కూల్చివేతలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

సీపీగా వినీత్ గోయల్‎ను తప్పించి.. సీనియర్ ఐపీఎస్ మనోజ్ శర్మను కోల్ కతా నూతన కమిషనర్‎గా నియమించింది. కొత్త ఇన్‌ఛార్జ్ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్‌గా డాక్టర్ స్వపన్ సోరెన్, మెడికల్ ఎడ్యుకేషన్ స్పెషల్ డ్యూటీ అధికారిగా డాక్టర్ సుపర్ణ దత్తాలను ప్రభుత్వం అపాయింట్ చేసింది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అధికారులపై ప్రభుత్వం బదిలీ వేటు వేయడంతో ఎట్టకేలకు జూడాల ఆందోళనలు ఫలించాయి. ఇక, దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసిన జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటనను సుప్రీంకోర్టు ఆదేశాలతో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ విచారణ చేస్తోన్న సంగతి తెలిసిందే.