తీగ లాగితే డొంక కదిలినట్లు.. కోల్ కతా ఆర్కే ఖర్ మెడికల్ కాలేజీ అండ్ ఆస్పత్రిలో ట్రైనీ డాక్టర్ పై అత్యాచారం, హత్య తర్వాత సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ట్రైనీ డాక్టర్ హత్యాచారం తర్వాత చేపట్టిన విచారణలో.. మాజీ ప్రిన్సిపల్ డాక్టర్ సందీప్ ఘోష్ వ్యవహారం కలకలం రేపుతోంది. అతను గుర్తు తెలియని శవాలను అమ్మేవాడని.. మెడికల్ వేస్ట్ వ్యాపారం చేసేవారంటూ మాజీ డిప్యూటీ సూపరింటెండెంట్ అలీ వెల్లడించారు.
మరో కీలకమైన అంశం ఏంటంటే.. హత్యాచారం తర్వాత రాజీనామా చేసిన ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ భద్రత పర్యవేక్షణలో.. హత్యాచార ఘటనలో ప్రధాన నిందితుడు అయిన సంజయ్ రాయ్ కీలక వ్యక్తి అని వివరించారు. ఈ విషయాలు బయటకు రావటంతో.. ఆస్పత్రిలో డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది మరోసారి ఆందోళనకు దిగారు. మెడికల్ కాలేజీలో ఏం జరుగుతోంది.. పూర్తి విచారణ చేయాలని.. ఇది మెడికల్ మాఫియా పని అంటూ ధర్నాకు దిగారు డాక్టర్లు, ట్రైనీ డాక్టర్లు.
మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ ను విచారించాలని.. అతన్ని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ట్రైనీ డాక్టర్ అభయ అత్యాచారం, హత్య కేసులో మాజీ ప్రిన్సిపాల్ ప్రమేయం ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అతని భద్రత విభాగంలో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ ఉండటం.. కొన్ని సంవత్సరాలుగా అతనితో దగ్గరి సంబంధాలు ఉండటంతో.. ఇప్పుడు ప్రిన్సిపాల్ వ్యవహారం కీలక చర్చనీయాంశం అయ్యింది.
సీబీఐ విచారణ ప్రారంభించిన వారం రోజులు అవుతున్నా.. ఇప్పటికీ కేసులో పురోగతిపై ఎలాంటి సమాచారం లేదని.. విచారణను సీబీఐ ఎందుకు వేగంగా చేయటం లేదంటూ డాక్టర్లు ప్రశ్నిస్తున్నారు. సీబీఐ తీరుకు నిరసనగా కోల్ కతాలోని సీఈవో కాంప్లెక్స్ నుంచి వైద్య ఆరోగ్య శాఖ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. శవాలతో వ్యాపారం, మెడికల్ వేస్ట్ మాఫియాపైనా పూర్తి స్థాయిలో విచారణ చేయాలని.. ఆ మాఫియాతో ట్రైనీ డాక్టర్ అత్యాచారం, హత్యకు ఉన్న సంబంధాలు బయటపెట్టాలని.. రాజీనామా చేసిన ప్రిన్సిపాల్ ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు డాక్టర్లు. ఈ ర్యాలీకి కోల్ కతాలోని ప్రజలు స్వచ్చంధంగా మద్దతు ప్రకటించారు. దీంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.