నేను అమాయకుడిని.. నన్ను ఇరికించారు: కోల్‌కతా డాక్టర్ కేసు నిందితుడు

నేను అమాయకుడిని.. నన్ను ఇరికించారు: కోల్‌కతా డాక్టర్ కేసు నిందితుడు

కోల్‌కతా ట్రైనీ డాక్టర్ అత్యాచారం- హత్య కేసు అనేక మలుపులు తిరుగుతోంది. మొదట డాక్టర్ మరణం సూసైడ్‌గా తెరమీదకు రాగా.. అనంతరం తల్లిదండ్రుల ఎంట్రీతో అత్యాచారం- హత్య కేసుగా మలుపు తిరిగింది. విచారణ మొదలుపెట్టిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ సాయంతో గంటల వ్యవధిలో సంజయ్ రాయ్ అనే నిందితుడిని అరెస్ట్ చేశారు. నిందితుడు పోలీసుల విచారణలో తన తప్పును అంగీకరించినట్లు వెల్లడించారు. అనంతరం మమతా ప్రభుత్వం కాలయాపన చేస్తోందటూ విమర్శలు రావడంతో ఈ కేసు సీబీఐకి బదిలీ అయ్యింది. ఆపై సీబీఐ అధికారుల విచారణలోనూ నిందితుడు తన తప్పును అంగీకరించినట్లు వార్తలొచ్చాయి.

నేను అమాయకుడిని..

తాజాగా, ఈ కేసులో నిందితుడిగా ఉన్న సంజయ్‌ రాయ్‌కు శనివారం(ఆగష్టు 24) పాలీగ్రాఫ్‌ టెస్ట్ జరగాల్సి ఉంది. ఈ క్రమంలో నిందితుడిని కోర్టు ముందు హాజరు పరచగా న్యాయస్థానం ఎదుట ప్లేట్ ఫిరాయించాడు. తాను అమాయకుడినని, తనను కావాలనే ఈ కేసులో ఇరికించారని వాపోయాడు. నిజానిజాలు బయటకు వస్తాయన్న ఆశతోనే తాను పాలీగ్రాఫ్‌ టెస్టుకు అనుమతించానని న్యాయస్థానానికి తెలిపాడు. దాంతో, ఈ కేసులో ఏం జరుగుతోందో అన్న అనుమానం ప్రజలలో మరింత ఎక్కువైంది. త్వరగతిన తీర్పు రాకుండా ఉండేందుకు నిందితుడు ఇలా మాట్లాడాడా..! లేదా పోలీసులు ఎవరో ఒకరిని పట్టుకోవాలన్నట్లు ఇతన్ని ఇరికించారా..! అనే కోణాల్లో ప్రశ్నలు తలెత్తుతున్నాయి.  

క్రైమ్‌సీన్‌ వద్ద సాక్ష్యాలు

నేరం జరిగిన ప్రాంతంలో పోలీసులు స్వాధీనం చేసుకున్న నిందితుడి బ్లూటూత్‌ ఇయర్‌ఫోన్స్‌ అతను కోర్టును తప్పుదారి పట్టిస్తున్నట్లు నిర్ధారిస్తున్నాయి. ట్రైనీ డాక్టర్ ఘటన జరిగిన రోజు రాత్రి నిందితుడు ఆర్‌జీ కర్‌ మెడికల్‌ కాలేజీలోకి ఎంటర్ అవుతున్న సమయంలో అతని చేతిలో హెల్మెట్, మెడలో బ్లూటూత్‌ ఇయర్‌ఫోన్స్‌ ఉంది. తిరిగి అతను బయటకు వెళ్లే సమయంలో మెడలో ఇయర్‌ఫోన్స్‌ లేదు. నేరం జరిగిన ప్రాంతం వద్ద పోలీసులు దానిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగానే నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.

కాగా, ఈ కేసులో సంజయ్‌రాయ్‌తో పాటు మరో ఏడుగురికి పాలిగ్రాఫ్‌ పరీక్షలు నిర్వహించేందుకు కోర్టు అనుమతినిచ్చింది. ఈ క్రమంలో లై డిటెక్టర్‌ పరీక్షకు సీబీఐ అధికారులు సన్నద్ధమవుతున్నారు.