కోల్​కతా డాక్టర్ హత్య కేసు..నిందితుడికి లై డిటెక్టర్ టెస్టు

కోల్​కతా డాక్టర్ హత్య కేసు..నిందితుడికి లై డిటెక్టర్ టెస్టు
  • ఆర్జీ కర్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్, మరో నలుగురు డాక్టర్లకూ పరీక్ష
  • తాను నేరం చేయలేదని.. ఇరికించారన్న నిందితుడు సంజయ్ రాయ్

కోల్​కతా:కోల్​కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో మహిళా ట్రెయినీ డాక్టర్​పై అత్యాచారం, హత్య కేసులో నిందితుడు సంజయ్ రాయ్​, మరో నలుగురు డాక్టర్లకు, ఒక వాలంటీర్​కు పాలీగ్రాఫ్ (లై డిటెక్టర్) పరీక్షను శనివారం ప్రారంభించినట్టు సీబీఐ వెల్లడించింది. కేసులో అరెస్టు అయిన నిందితుడు సంజయ్ రాయ్​తోపాటు ఆర్జీ కర్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ కు, డాక్టర్​పై అఘాయిత్యం జరిగిన ఆగస్టు 9వ తేదీన డ్యూటీలో ఉన్న నలుగురు డాక్టర్లకు, ఒక సివిల్ వాలంటీర్ కు కూడా ఈ టెస్టు చేస్తున్నట్టు తెలిపింది. ఈ ఆరుగురికి పాలీగ్రాఫ్ టెస్టు నిర్వహించేందుకు ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబోరేటరీ బృందం కోల్​కతాకు వచ్చిందని, నిందితుడికి జైలులో, మిగతా వారికి తమ ఆఫీసులో 
టెస్టు నిర్వహిస్తున్నామని సీబీఐ వెల్లడించింది.

కోర్టులో నిందితుడి భావోద్వేగం.. 

ఈ కేసులో నిందితుడు సంజయ్ రాయ్​ను సీబీఐ అధికారులు శుక్రవారం కోల్​కతాలోని కోర్టులో హాజరుపర్చగా అతడు భావోద్వేగానికి గురైనట్టు జాతీయ మీడియా వెల్లడించింది. ‘‘నేను ఏ తప్పూ చేయలేదు. నన్ను ఈ కేసులో ఇరికించారు. పాలిగ్రాఫ్ టెస్టుతో నిజం ప్రూవ్ అవుతుందనే ఈ టెస్టు చేయించుకునేందుకు ఒప్పుకున్నా” అని అతడు జడ్జి ముందు చెప్తూ కంటతడి పెట్టినట్టు పేర్కొంది. దీంతో నిందితుడికి పాలిగ్రాఫ్ టెస్టుకు అనుమతిస్తూ అతడిని 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 

అలాగే సీబీఐ విజ్ఞప్తి మేరకు మాజీ ప్రిన్సిపాల్, మిగతా డాక్టర్లకూ టెస్టులు చేసేందుకు అనుమతించింది. కాగా, డాక్టర్ హత్య జరిగిన రోజున రాత్రి ఆర్జీ కర్ ఆస్పత్రి సెమినార్ హాల్​లోకి నిందితుడు వెళ్లినట్టు సీసీటీవీ ఫుటేజీలో తేలింది. క్రైమ్ సీన్​లో నిందితుడి బ్లూటూత్ హెడ్ సెట్​ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో అతడు పూసగుచ్చినట్టు నేరం ఎలా చేశాడో వివరించాడని, ఎలాంటి పశ్చాత్తాపం కూడా కనిపించలేదని దర్యాప్తు అధికారులు వెల్లడించారు.