సిగరెట్‌ తో 'జనగణమన' పాడిన అమ్మాయిలు.. కేసు నమోదు

సిగరెట్‌ తో 'జనగణమన' పాడిన అమ్మాయిలు.. కేసు నమోదు

భారతీయులు అత్యంత గౌరవంగా భావించే జాతీయ గీతం 'జనగణమన'ను ఇద్దరు అమ్మాయిలు అపహాస్యం చేశారు. సిగరెట్ తాగుతూ జాతీయ గీతాన్ని పాడి, అగౌరవపరిచారు. వివరాల్లోకి వెళితే.. కోల్ కతాకు చెందిన ఇద్దరు అమ్మాయిలు.. చేతిలో సిగరెట్ పట్టుకొని, దాన్ని చూపిస్తూ జాతీయ గీతాన్ని ఆలపించారు. అంతేకాదు అందులోని సాహిత్యాన్ని తప్పుగా పాడుతూ, సిగరెట్ తాగుతూ నవ్వుతూ కనిపించారు. దానికి తోడు ఆ వీడియోను సోషల్ మీడియాలోనూ షేర్ చేశారు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. 

వీడియో వైరల్ కావడంతో ఈ ఇద్దరు అమ్మాయిలపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. జాతీయ గీతాన్ని అపహాస్యం చేశారని విమర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే వారిద్దరిపై బరఖ్‌పూర్ సైబర్ సెల్ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఆ తర్వాత అమ్మాయిలు ఆ వీడియోను ఫేస్‌బుక్ నుంచి డిలీట్ చేశారు. కేవలం సరదా కోసమే చేశామని. ఈ వీడియో కోసం తమ స్నేహితుడితో పందెం వేశామని, అందుకే ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశామని చెబుతున్నారు. 

ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ కేసులో ఇద్దరూ గనక దోషులుగా తేలితే మూడేళ్ల వరకు జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించవచ్చని అంచనా వేస్తున్నారు.