
గౌహతి వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో రాజస్థాన్ బ్యాటింగ్ లో విఫలమైంది. కేకేఆర్ బౌలర్లు సమిష్టిగా రాణించడంతో ఒక మాదిరి స్కోర్ కే పరిమితమైంది. వరుణ్ చక్రవర్తి, మొయిన్ అలీ స్పిన్ మాయాజాలం చూపించడంతో నిర్ణీత 20 ఓవర్లలో రాజస్థాన్ రాయల్స్ 9 వికెట్ల నష్టానికి 151 పరుగులు మాత్రమే చేయగలిగింది. 33 పరుగులు చేసి ధృవ్ జురెల్ టాప్ స్కోరర్ గా నిలిచాడు. కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, మొయిన్ అలీ, వైభవ్ అరోరా, హర్షిత్ రానా తలో రెండు వికెట్లు పడగొట్టారు. స్పెన్సర్ జాన్సెన్ కు ఒక వికెట్ దక్కింది.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ ఆచితూచి ఇన్నింగ్స్ ను ఆరంభించింది. సంజు శాంసన్, జైశ్వాల్ ఎలాంటి భారీ షాట్లకు పోకుండా జాగ్రత్తగా ఆడారు. అయితే నాలుగో ఓవర్ లో వైభవ్ ఒక చక్కని బంతితో శాంసన్(13)ను బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత పరాగ్,జైశ్వాల్ కాసేపు మెరుపులు మెరిపించినా ఎక్కువ సేపు క్రీజ్ లో నిలవలేకపోయారు. 25 పరుగులు చేసిన పరాగ్.. వరుణ్ చక్రవర్తికి చిక్కాడు. ఆ తర్వాత ఓవర్ లోనే భారీ షాట్ కు ప్రయత్నించి జైశ్వాల్ (29) పెవిలియన్ కు చేరాడు.
ఇక్కడ నుంచి రాజస్థాన్ ఏ దశలోనూ సెట్ అవుతున్నట్టు కనిపించలేదు. హసారంగా(4), నితీష్ రాణా(8) వరుస ఓవర్లలో ఔటయ్యారు. దీంతో 85 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఒక ఎండ్ లో వికెట్లు పడుతున్నా.. మరో ఎండ్ లో ధృవ్ జురెల్ జట్టును ఆదుకోవడానికి తన వంతు ప్రయత్నం చేశాడు. 33 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. హెట్ మేయర్ (7), శుభమ్ దూబే (9) నిరాశపర్చినా చివర్లో ఆర్చర్ రెండు సిక్సర్లతో స్కోర్ బోర్డును 150 పరుగులకు చేర్చాడు.
Kolkata Knight Riders' bowlers put on a stellar show, limiting Rajasthan Royals to 151/9 in 20 overs. pic.twitter.com/hZ1L7zUoDw
— CricTracker (@Cricketracker) March 26, 2025