IPL 2024: కేకేఆర్ జట్టులో కీలక మార్పు..ఇంగ్లాండ్ పేసర్ ఔట్

IPL 2024: కేకేఆర్ జట్టులో కీలక మార్పు..ఇంగ్లాండ్ పేసర్ ఔట్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 వచ్చే (మార్చి) నెలలో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. అధికారికంగా ఇంకా ప్రకటించకపోయినా మార్చి 22 నుంచి ఈ మెగా లీగ్ జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కోల్ కతా నైట్ రైడర్స్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇంగ్లాండ్ యువ పేస్ బౌలర్ గుస్ అట్కిన్సన్ స్థానంలో దుష్మంత చమీరను ఎంపిక చేసింది. చమీర 50 లక్షల కనీస ధరతో KKRలో చేరనున్నాడు. అట్కిన్సన్ తొలిసారి ఐపీఎల్ కు ఎంపికైనా నిరాశ తప్పలేదు.

శ్రీలంక స్పీడ్‌స్టర్ చమీర తన స్వింగ్, సీమ్ తో బ్యాటర్‌లను ఇబ్బంది పెట్టగలడు. ఐపీఎల్ లో ఆడిన అనుభవం కూడా ఉంది. 2018 లో రాజస్థాన్ రాయల్స్.. 2021 సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ప్రాతినిధ్యం వహించాడు. 2022 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్‌కు ఆడి 12 మ్యాచ్‌లలో తొమ్మిది వికెట్లు పడగొట్టాడు. 2023 డిసెంబర్ 19న దుబాయి వేదికగా మినీ యాక్షన్ లో అట్కిన్సన్ ను కేకేఆర్ దక్కించుకుంది. 

ఈ వేలంలో ఐపీఎల్ ప్రాంచైజీ కోల్‌కతా నైట్‌రైడర్స్ మిచెల్ స్టార్క్ ను ఏకంగా 24.75 కోట్ల రికార్డ్ ధరకు దక్కించుకుంది. ఐపీఎల్  చరిత్రలోనే ఇది అత్యధిక ధర కావడం విశేషం. వెన్ను నొప్పి కారణంగా గత సీజన్‌కు దూరమైన శ్రేయస్‌ అయ్యరే తమ జట్టు కెప్టెన్‌ అని ప్రకటన చేసింది. అతడికి డిప్యూటీగా నితీశ్ రాణా వ్యవహరిస్తాడని తెలిపింది.

గాయం కారణంగా గత ఎడిషన్‌కు అయ్యర్ దూరమవ్వడం దురదృష్టకరమన్న కేకేఆర్ సీఈవో వెంకీ మైసూర్, దాని నుంచి కోలుకునేందుకు అతను కష్టపడిన విధానం ప్రశంసనీయమని చెప్పుకొచ్చారు. కెప్టెన్‌గా అతడు మళ్లీ బాధ్యతలు చేపట్టి జట్టును విజయపథంలో నడిపిస్తాడనే నమ్మకం తమకు ఉందని తెలిపారు.