ఐపీఎల్17లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఆరో విజయంతో సిక్సర్ కొట్టింది. 12 పాయింట్లతో ప్లే ఆఫ్స్ బెర్తుకు చేరువ కాగా.. వరుసగా రెండు విజయాల తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ డీలా పడింది. బౌలింగ్‌లో వరుణ్ చక్రవర్తి (3/16), బ్యాటింగ్‌లో ఫిల్ సాల్ట్ (33 బాల్స్‌లో 7 ఫోర్లు, 5 సిక్సర్లతో 68) సత్తా చాటడంతో సోమవారం జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ 7 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించింది. టాస్ నెగ్గిన ఢిల్లీ 20 ఓవర్లలో 153/9 స్కోరు మాత్రమే చేసింది. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ (26 బాల్స్‌లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 34 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. వరుణ్ చక్రవర్తి మూడు, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం కేకేఆర్ 16.3 ఓవర్లలోనే 157/3 స్కోరు చేసి ఈజీగా గెలిచింది. సాల్ట్‌తో పాటు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (23 బాల్స్‌లో 3 ఫోర్లు, 1 సిక్స్‌తో 33 నాటౌట్) రాణించాడు. చక్రవర్తికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
ఢిల్లీ తడబాటు
తొలి ఓవర్లో ఓపెనర్ పృథ్వీ షా (13) వరుసగా మూడు ఫోర్లు కొట్టడంతో మెరుపు వేగంతో మొదలైన ఢిల్లీ అంతే వేగంగా వికెట్లు కోల్పోయింది. చివర్లో కుల్దీప్ యాదవ్ ఆదుకోవడంతో ఆ మాత్రం స్కోరు చేసింది. స్టార్క్ బౌలింగ్‌లో హ్యాట్రిక్ ఫోర్లతో ఆకట్టుకున్న పృథ్వీ.. వైభవ్ వేసిన రెండో ఓవర్లో కీపర్‌కు క్యాచ్ ఇచ్చాడు. దీనికి రివ్యూ కూడా వేస్ట్ చేశాడు. సూపర్ ఫామ్‌లో ఉన్న జేక్ ఫ్రేజర్(12).. స్టార్క్ బౌలింగ్‌లో 6,4 కొట్టి తర్వాతి బాల్‌కు మరో షాట్‌కు ట్రై చేసి శ్రేయస్‌కు క్యాచ్ ఇచ్చాడు. ఎదుర్కొన్న రెండో బాల్‌కే సిక్స్ కొట్టిన షై హోప్ (6)ను మూడో బాల్‌కు వైభవ్ క్లీన్ బౌల్డ్ చేయడంతో ఢిల్లీ 37/3తో కష్టాల్లో పడింది. ఈ దశలో కెప్టెన్ పంత్, అభిషేక్ పోరెల్ (18) కాసేపు ప్రతిఘటించారు. హర్షిత్ రాణా బౌలింగ్‌లో పోరెల్4,6,4 బాదగా.. నరైన్ ఓవర్లో పంత్ డీప్ మిడ్ వికెట్ మీదుగా సిక్స్ కొట్టాడు. దాంతో పవర్‌ప్లేలో ఢిల్లీ 67/3తో నిలిచింది. ఫీల్డింగ్ మారిన తర్వాత క్యాపిటల్స్ స్కోరు మందగించింది. హర్షిత్ వేసిన ఏడో ఓవర్లో స్కూప్ షాట్‌కు ట్రై చేసిన పోరెల్ బౌల్డ్ అయ్యాడు. తర్వాతి రెండు ఓవర్లలో ఒక్క బౌండరీ కూడా రాలేదు. వైభవ్ వేసిన పదో ఓవర్లో పంత్ మూడు ఫోర్లతో ఇన్నింగ్స్‌కు ఊపు తెచ్చే ప్రయత్నం చేశాడు. కానీ, స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఫుల్ లెంగ్త్ బాల్‌కు భారీ షాట్ ఆడే ప్రయత్నంలో పంత్.. శ్రేయస్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరగడంతో డీసీ 93/5తో మరింత డీలా పడింది. ట్రిస్టాన్ స్టబ్స్ (4) నిరాశ పరిచాడు. అతడిని చక్రవర్తి స్టంపౌట్ చేశాడు. క్రీజులో ఇబ్బంది పడిన అక్షర్ పటేల్ (21 బాల్స్‌లో 15) ను 14వ ఓవర్లో నరైన్ బౌల్డ్ చేయగా.. ఆవెంటనే కుమార్ కుశాగ్ర (1)ను చక్రవర్తి పెవిలియన్ చేర్చడంతో ఢిల్లీ 111/8తో నిలిచి ఆలౌటయ్యేలా కనిపించింది. కానీ, స్లాగ్ ఓవర్లలో కుల్దీప్ అనూహ్యంగా పోరాడాడు. స్టార్క్ వేసిన 16వ ఓవర్లో 6,4 సహా 16 రన్స్ రాబట్టిన అతను రసెల్ వేసిన ఆఖరి ఓవర్లో రెండు ఫోర్లతో స్కోరు 150 దాటించాడు.
సాల్ట్ ఫటాఫట్
చిన్న టార్గెట్ ఛేజింగ్‌లో ఓపెనర్ ఫిల్ సాల్ట్ దంచికొట్టడంతో ఢిల్లీ సులువుగా గెలిచింది. లిజాడ్ విలియమ్స్ వేసిన తొలి ఓవర్లోనే సాల్ట్ మూడు ఫోర్లు, సిక్స్ సహా 23 రన్స్ పిండుకున్నాడు. విలియమ్స్ తర్వాతి ఓవర్లో వరుసగా రెండు సిక్సర్లతో విజృంభించాడు. రసిఖ్ ధార్ బౌలింగ్‌లో రెండు ఫోర్లతో నరైన్ (15) కూడా టచ్‌లోకి రాగా.. ఖలీల్ వేసిన ఆరో ఓవర్లో సాల్ట్ 4, 6, 4, 4తో చెలరేగాడు. ఈ క్రమంలో అతను 26 బాల్స్‌లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకోగా.. పవర్ ప్లేలోనే కేకేఆర్ 79 రన్స్ రాబట్టింది. ఏడో ఓవర్లో బౌలింగ్‌కు వచ్చిన అక్షర్ తన తొలి బాల్‌కే నరైన్‌ను ఔట్ చేసి ఈ జోడీని విడదీశాడు. కుల్దీప్ బౌలింగ్‌లో సిక్స్ కొట్టిన సాల్ట్‌ను తన తర్వాతి ఓవర్లోనే బౌల్డ్ చేశాడు. ఆవెంటనే రింకూ సింగ్ (11)ను విలియమ్స్ పెవిలియన్ చేర్చి కేకేఆర్ జోరుకు బ్రేకులు వేసే ప్రయత్నం చేశాడు. అప్పటికే స్కోరు వంద దాటగా.. అక్షర్ బౌలింగ్‌లో వరుసగా రెండు ఫోర్లతో శ్రేయస్ అయ్యర్ ఛేజింగ్‌కు మళ్లీ ఊపు తెచ్చాడు. వెంకటేశ్ అయ్యర్ (26 నాటౌట్ )తో కలిసి టార్గెట్‌ను కరిగించాడు. రసిఖ్ బౌలింగ్‌లో విన్నింగ్ సిక్స్ కొట్టిన వెంకటేశ్ మ్యాచ్‌ను ముగించాడు.
సంక్షిప్త స్కోర్లు
ఢిల్లీ: 20 ఓవర్లలో 153/9 (కుల్దీప్ 35*, పంత్ 27, వరుణ్ చక్రవర్తి 3/16).
కోల్‌కతా: 16.3 ఓవర్లలో 157/3 (సాల్ట్ 68, శ్రేయస్ 33*, అక్షర్ 2/25).