వైజాగ్ వేదికగా జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ ఢిల్లీపై పంజా విసిరింది. మొదట బ్యాటింగ్ లో విజృంభించిన ఆ జట్టు ఆ తర్వాత బౌలింగ్ లో సమిష్టిగా రాణించింది. దీంతో 106 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ ను చిత్తు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 272 పరుగుల భారీ స్కోర్ చేసింది. లక్ష్య ఛేదనలో ఢిల్లీ 166 పరుగులకే పరిమితమైంది. కేకేఆర్ కు ఇది వరుసగా మూడో విజయం కాగా.. నాలుగు మ్యాచ్ లాడిన ఢిల్లీకి ఇది మూడో ఓటమి.
273 పరుగుల అసాధారణ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ పవర్ ప్లే లోనే నాలుగు వికెట్లు కోల్పోయింది. పేసర్లు స్టార్క్, వైభవ్ అరోరా కట్టుదిట్టంగా బంతులు వేయడంతో పృథ్వీ షా(10), మిచెల్ మార్ష్(0), వార్నర్(18), అభిషేక్ పోరెల్(0) తక్కువ స్కోర్ కే ఔటయ్యారు. ఈ దశలో కెప్టెన్ రిషబ్ పంత్(55), ట్రిస్టన్ స్టబ్స్ (54) మెరుపులు మెరిపించారు.
ఐదో వికెట్ కు వీరిద్దరూ 8 ఓవర్లలోనే 93 పరుగులు జోడించారు. ఈ క్రమంలో వీరిద్దరూ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. అయితే లక్ష్యం మరీగా ఉండడంతో వీరిద్దరూ బ్యాట్ ఝళిపించే ప్రయత్నంలో ఔటయ్యారు. దీంతో ఢిల్లీ పరాజయం ఖరారైంది. కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా తలో మూడు వికెట్లు పడగొట్టారు. స్టార్క్ రెండు, నరైన్, రస్సెల్ ఒక వికెట్ తీసుకున్నారు.
అంతకముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కేకేఆర్ నరైన్ ఊచకోతకు తోడు రఘువంశీ, రస్సెల్, అయ్యర్ మెరుపులతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. కేకేఆర్ బౌలర్లపై విరుచుకుపడిన నరైన్ 39 బంతుల్లో 7 ఫోర్లు 7 సిక్సులతో 85 పరుగులు చేసి భారీ స్కోర్ అందించాడు. రస్సెల్ 19 బంతుల్లోనే 3 సిక్సులు, నాలుగు ఫోర్లతో 41 పరుగులు.. రింకూ సింగ్ 8 బంతుల్లోనే 3 సిక్సులు ఒక ఫోర్ తో 26 పరుగులతో స్టేడియాన్ని హోరెత్తించారు. ఢిల్లీ బౌలర్లలో నోకియా మూడు వికెట్లు తీసుకోగా.. ఇషాంత్ శర్మ 2 వికెట్లు పడగొట్టాడు. ఖలీల్ అహ్మద్, మిచెల్ మార్ష్ తలో వికెట్ తీసుకున్నారు.
Kolkata Knight Riders won by 106 runs against Delhi Capitals: DC vs KKR pic.twitter.com/iGhPunrKWH
— CRICPUR (@cricpur) April 3, 2024