
ఐపీఎల్ 2025లో కోల్‌కతా నైట్ రైడర్స్ ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. వరుస ఓటముల తర్వాత తీవ్ర ఒత్తిడిలో ఉన్న కేకేఆర్.. ఎట్టకేలకు మంగళవారం (ఏప్రిల్ 29) ఢిల్లీ క్యాపిటల్స్ పై 14 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో బ్యాటింగ్ లో సమిష్టిగా రాణించడంతో పాటు బౌలింగ్ లో సునీల్ నరైన్ కీలక దశలో మూడు వికెట్లతో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 204 పరుగుల భారీ స్కోర్ చేసింది. లక్ష్య ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగులకు పరిమితమైంది.
205 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ కు తొలి ఓవర్లోనే బిగ్ షాక్ తగిలింది. తొలి బంతికి ఫోర్ కొట్టిన అభిషేక్ పోరెల్ (4) రెండో బంతికి అనుకుల్ రాయ్ బౌలింగ్ లో ఔటయ్యాడు. ఈ దశలో కరుణ్ నాయర్, డుప్లెసిస్ చిన్న భాగస్వామ్యాన్ని నిర్మించారు. రెండో వికెట్ కు 39 పరుగులు జోడించిన తర్వాత కరుణ్ నాయర్ (15) ను వైభవ్ అరోరా ఎల్బీడబ్ల్యూ రూపంలో వెనక్కి పంపాడు. ఒక ఎండ్ లో డుప్లెసిస్ అదరగొట్టడంతో పవర్ ప్లే లో ఢిల్లీ 2 వికెట్ల నష్టానికి 58 పరుగులు చేసింది. ఏడో ఓవర్లో ఢిల్లీకి ఊహించని షాక్ తగిలింది. సమన్వయ లోపంతో రాహుల్ (7) లేని పరుగు కోసం ప్రయత్నించి రనౌటయ్యాడు.
60 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి ఢిల్లీ కష్టాల్లో పడింది. ఈ సమయంలో ఢిల్లీ భారాన్ని ఓపెనర్ డుప్లెసిస్, కెప్టెన్ అక్షర్ పటేల్ మోశారు. వీరిద్దరూ కౌంటర్ ఎటాక్ చేస్తూ కేకేఆర్ బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టారు. ఈ క్రమంలో డుప్లెసిస్ 31 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. నాలుగో వికెట్ కు 76 పరుగులు జోడించి ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని సునీల్ నరైన్ విడగొట్టాడు. ఒకే ఓవర్లో అక్షర్ పటేల్ (43)తో పాటు.. స్టబ్స్ (0) ను క్లీన్ బౌల్డ్ చేశాడు. కాసేపటికే డుప్లెసిస్ (62) భారీ షాట్ కు ప్రయత్నించి బౌండరీ వద్ద క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. చివర్లో విప్రజ్ నిగమ్ (19 బంతుల్లో 38) బౌండరీలతో బయపెట్టినా ఢిల్లీకి విజయాన్ని అందించలేకపోయాడు.
కోల్‌కతా బౌలర్లలో నరైన్ మూడు వికెట్లు పడగొట్టాడు. వరుణ్ చక్రవర్తి రెండు.. అనుకుల్ రాయ్, వైభవ్ అరోరా, రస్సెల్ తలో వికెట్ తీసుకున్నారు. అంతకముందు టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాటింగ్ లో రెచ్చిపోయి ఆడింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో వచ్చినవారు వచ్చినట్టు బ్యాట్ ఝుళిపించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 204 పరుగుల భారీ స్కోర్ చేసింది. 44 పరుగులు చేసిన అంగ్క్రిష్ రఘువంశీ టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఢిల్లీ బౌలర్లలో అక్షర్ పటేల్, విప్రజ్ నిగమ్,స్టార్క్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. చమీరాకు ఒక వికెట్ దక్కింది
KKR stay alive in the tournament 💪#DCvKKR SCORECARD: https://t.co/yFC6tQeTaz pic.twitter.com/7LMKEysF6y
— ESPNcricinfo (@ESPNcricinfo) April 29, 2025