KKR vs SRH: కోల్‌కతా ధాటికి కుప్పకూలిన సన్ రైజర్స్.. 80 పరుగుల తేడాతో ఘోర ఓటమి

KKR vs SRH: కోల్‌కతా ధాటికి కుప్పకూలిన సన్ రైజర్స్.. 80 పరుగుల తేడాతో ఘోర ఓటమి

ఐపీఎల్ 2025లో సన్ రైజర్స్ హైదరాబాద్ మరో ఘోర పరాజయాన్ని చవి చూసింది. ఈడెన్ గార్డెన్ వేదికగా గురువారం (ఏప్రిల్ 3) కోల్‌కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో 80 పరుగుల తేడాతో చిత్తు చిత్తుగా ఓడింది. మొదట బౌలింగ్ లో నిరాశపరిచిన హైదరాబాద్ జట్టు.. ఆ తర్వాత బ్యాటింగ్ లో ఘోరంగా విఫలమైంది. మరోవైపు సొంతగడ్డపై కోల్‌కతా విజృంభించి టోర్నీలో రెండో విజయాన్ని నమోదు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 200 పరుగుల భారీ స్కోర్ చేసింది. లక్ష్య ఛేదనలో సన్ రైజర్స్ హైదరాబాద్ 16.4 ఓవర్లలో 120 పరుగులకు ఆలౌట్ అయింది. 

201 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ కు ఘోరమైన ఆరంభం లభించింది. ఇన్నింగ్స్ మొదటి బంతికి ఫోర్ కొట్టిన హెడ్.. రెండో బంతికి భారీ షాట్ కు ప్రయత్నించి ఔటయ్యాడు. రెండో ఓవర్ లో అభిషేక్ శర్మ (2).. మూడో ఓవర్ లో ఇషాన్ కిషాన్ (2) పెవిలియన్ కు క్యూ కట్టారు. దీంతో 9 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయి హైదరాబాద్ జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో నితీష్ కుమార్, కామిందు మెండీస్ కాసేపు ఇన్నింగ్స్ ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. కాసేపు మెరుపులు మెరిపించినా రస్సెల్ ఓవర్ లో 19 పరుగులు చేసిన నితీష్ ఔటయ్యాడు.

ఉన్నంత సేపు మెరుపులు మెరిపించి మెండీస్ 27 పరుగులు చేసి నరైన్ చేతికి చిక్కాడు. గత మ్యాచ్ హీరో అనికేత్ వర్మ 6 పరుగులే చేసి ఔట్ కావడంతో 75 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి మ్యాచ్ పై ఆశలు వదిలేసుకుంది. క్లాసన్ కొన్ని మెరుపులు మెరిపించినా అవి జట్టు విజయానికి ఏ మాత్రం సరిపోలేదు. కోల్‌కతా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా చెరో మూడు వికెట్లు తీసుకున్నారు. రస్సెల్ రెండువై వికెట్లు పడగొట్టాడు. హర్షిత్ రానా, నరైన్ లకు తలో వికెట్ లభించింది.       

ALSO READ | KKR vs SRH: ఇది మామూలు టాలెంట్ కాదు: రెండు చేతులతో బౌలింగ్ వేసి వికెట్!

మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 200 పరుగుల భారీ స్కోర్ చేసింది. కెప్టెన్ అజింక్య రహానే, అంగ్క్రిష్ రఘువంశీ భాగస్వామ్యానికి తోడు వెంకటేష్ అయ్యర్ (29 బంతుల్లో 60:7 ఫోర్లు, 3 సిక్సర్లు), రింకూ సింగ్ (32) మెరుపులు మెరిపించారు. సన్ రైజర్స్ బౌలర్లలో షమీ, కమ్మిన్స్, జీషాన్ అన్సారీ, మెండీస్, హర్షల్ పటేల్ తలో వికెట్ తీసుకున్నారు.