మామూలుగా ఎవరైనా తమ గురించి గొప్పగా చెప్పుకుంటుంటే.. ‘గాల్లో మేడలు కడితే పేక మేడల్లా కూలిపోతాయి. ఏదైనా ఉంటే చేసి చూపించు.. అప్పుడు నమ్ముతాం నువ్వు గొప్పని’ అంటుంటారు. అయితే ఇక్కడున్న టీనేజ్ కుర్రాడు అచ్చం పేకలతోనే మేడలు కట్టి, గొప్పవాడు అనిపించుకున్నాడు.
కోల్కతాకు చెందిన ఆర్ణవ్ దాగాకు పదిహేనేండ్లు. పేకలతో ‘ది రైటర్స్ బిల్డింగ్, ది షహీద్ మినార్, సాల్ట్ లేక్ స్టేడియం, సెయింట్ పాల్ కేథడ్రల్’ వంటి మేడలు కట్టి, ప్రపంచ రికార్డు సొంతం చేసుకున్నాడు.
దీనికోసం 41 రోజులు కష్టపడ్డాడు. టాస్క్ పూర్తి చేసి ‘శభాష్’ అనిపించుకున్నాడు. ఈ మేడలు కట్టడానికి అక్షరాలా ఒక లక్షా నలభై మూడు వేల పేకలు వాడాడు. వాటిని ఒకదానిమీద ఒకటి పేర్చడానికి టేప్, గమ్ లాంటివేవీ వాడలేదు. మరి అవి గాలికి పడిపోలేదా? అనుకోవచ్చు. అలా పడిపోకుండా ఉండేందుకే ఎత్తయిన, గాలి చొరబడని ఫ్లాట్ ఫ్లోర్లో ఈ పేక కట్టడాలు కట్టాడు. వాటిని ఎలా కట్టాలో? ఆయా భవనాల ఆర్కిటెక్చర్ని ముందుగా స్టడీ చేశాడు.
‘ఎనిమిదేండ్ల వయసులోనే పేకలతో బిల్డింగ్స్ కట్టడం అలవాటైంది. లాక్డౌన్లో ఫోకస్ మొత్తం దానిమీద పెట్టేందుకు టైం దొరికింది. ఫైనల్గా వరల్డ్ రికార్డ్ కోసం ప్రయత్నించడం, అందులో గెలవడం చాలా సంతోషంగా ఉంది’ అన్నాడు ఆర్ణవ్.