- రాణించిన శ్రేయస్, స్టార్క్
- పూరన్, రాహుల్ శ్రమ వృథా
కోల్‌కతా: ఐపీఎల్17లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు నాలుగో విజయం దక్కింది. ఛేజింగ్‌లో ఫిల్ సాల్ట్ (47 బాల్స్‌లో 14 ఫోర్లు, 3 సిక్స్‌లతో 89 నాటౌట్) విజృంభణకు తోడు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (38 బాల్స్‌లో 6 ఫోర్లతో 38నాటౌట్) నిలకడగా ఆడటంతో.. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ 8 వికెట్ల తేడాతో లక్నో సూపర్‌జెయింట్స్‌పై అలవోకగా గెలిచింది. టాస్ ఓడిన లక్నో 20 ఓవర్లలో 161/7 స్కోరు చేసింది. నికోలస్ పూరన్ (32 బాల్స్‌లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 45), కేఎల్ రాహుల్ (37 బాల్స్‌లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 39) రాణించారు.
తర్వాత కోల్‌కతా 15.4 ఓవర్లలో 162/2 స్కోరు చేసి ఈజీగా నెగ్గింది. ఛేజింగ్ ఆరంభంలోనే నైట్‌రైడర్స్‌ను మోషిన్ ఖాన్ (2/29) దెబ్బకొట్టాడు. 2, 4వ ఓవర్లలో వరుసగా సునీల్ నరైన్ (6), అంగ్‌క్రిష్ రఘువంశీ (7)ని ఔట్ చేయడంతో 42/2 స్కోరుతో కష్టాల్లో పడింది. ఈ దశలో సాల్ట్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. శ్రేయస్ బాల్‌కో రన్ తీసి అండగా నిలిచాడు. ఈ ఇద్దరి జోరుతో పవర్‌ప్లేలో 58/2 స్కోరు చేసిన కోల్‌కతా 9.4 ఓవర్లలోనే 100 రన్స్‌కు చేరింది. మిడాఫ్, లాంగాఫ్, లాంగాన్ మూడు భారీ సిక్సర్లు కొట్టిన సాల్ట్ 26 బాల్స్‌లోనే హాఫ్ సెంచరీ ఫినిష్ చేశాడు. ఈ క్రమంలో మూడో వికెట్‌కు 76 బాల్స్‌లోనే 120 రన్స్ జత చేసిన సాల్ట్, శ్రేయస్ కేకేఆర్‌ను గెలిపించారు. సాల్ట్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
మెరిసిన స్టార్క్
ముందుగా బ్యాటింగ్‌కు దిగిన లక్నోకు సరైన ఆరంభం దక్కలేదు. కేకేఆర్ పేసర్ మిచెల్ స్టార్క్ (3/28) మూడు కీలక వికెట్లు తీసి ఆ టీమ్‌ను కట్టడి చేశాడు. రెండు ఫోర్లతో టచ్‌లో కనిపించిన ఓపెనర్ క్వింటన్ డికాక్ (10) రెండో ఓవర్‌లోనే వెనుదిరగగా, ఐదో ఓవర్‌లో దీపక్ హుడా (8) పెవిలియన్‌కు చేరాడు. 39/2తో కష్టాల్లో పడిన ఇన్నింగ్స్‌ను రాహుల్, బదోనీ (29) ఆదుకునే ప్రయత్నం చేసినా భారీ స్కోరు అందించలేకపోయారు. దీంతో పవర్‌ప్లేలో 49/2 స్కోరు చేసిన లక్నో సగం ఓవర్లకు 72/2కే పరిమితమైంది.
11వ ఓవర్‌లో భారీ సిక్స్ బాదిన రాహుల్ తర్వాతి బాల్‌కే వికెట్ ఇచ్చుకున్నాడు. ఐదు బాల్స్ తర్వాత స్టోయినిస్ (10) కూడా ఔట్‌కావడంతో స్కోరు 95/4గా మారింది. మరో ఆరు రన్స్ జత చేసి బదోనీ వికెట్ ఇవ్వడంతో 111 రన్స్‌కే లక్నో సగం జట్టును కోల్పోయింది. ఈ దశలో నికోలస్ పూరన్ ఒంటరి పోరాటం చేశాడు. క్రునాల్ పాండ్యా (7 నాటౌట్)తో కలిసి ఆరో వికెట్‌కు 44 రన్స్ జోడించాడు. కానీ లాస్ట్ ఓవర్‌లో స్టార్క్ దెబ్బకు పూరన్, అర్షద్ ఖాన్ (5) ఔట్ కావడంతో లక్నో చిన్న టార్గెట్‌కే పరిమితమైంది.
సంక్షిప్త స్కోర్లు
లక్నో: 20 ఓవర్లలో 161/7 (పూరన్ 45, రాహుల్ 39, స్టార్క్ 3/28).
కోల్‌కతా: 15.4 ఓవర్లలో 162/2 (సాల్ట్ 89*, మోషిన్ ఖాన్ 2/29).