
కొల్లేరు సరస్సు దేశ విదేశాలకు చెందిన ఎన్నో రకాలైన పక్షులకు స్వర్గధామంగా నిలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సహజ సరస్సు వద్దకు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకు చెందిన పక్షులు గుంపులు గుంపులుగా వలస వస్తాయి. ప్రతి సంవత్సరం ఎన్నో పక్షులు అనేక నదులు, సరస్సులు, మహాసముద్రాలను దాటి అతిథులుగా మన దేశానికి వచ్చి ఈ ప్రత్యేకమైన సరస్సులో విశ్రాంతి తీసుకుంటాయి. దేశ, విదేశ విహాంగాలు చేసే సందడి ప్రకృతి ప్రేమికులను ఎంతో ఆహ్లాదానికి గురిచేస్తోంది. ముఖ్యంగా ఆర్నిథోఫైల్స్ (పక్షి ప్రేమికులు) ప్రతి సంవత్సరం ప్రపంచం నలుదిక్కుల నుంచి వచ్చి కనువిందు చేసే పక్షులను తనివితీరా వీక్షించడానికి ఇక్కడికి తరలివస్తారు. చాలామంది పక్షి ప్రేమికులు ఆ ప్రత్యేక అంశంలో పీహెచ్‌డీ చేయడంపై దృష్టి సారిస్తున్నారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు... ఏపీ రాష్ట్రంలోని కొల్లేరు సరస్సుకు సంబంధించి తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
ముఖ్యంగా పక్షులకు సంబంధించిన శాస్త్రంపై ప్రభుత్వాలు ప్రత్యేకంగా దృష్టి పెట్టవచ్చు. ఇప్పటికే ప్రముఖ పర్యావరణవేత్తలు మెమోరాండంలు సమర్పించడం, పత్రికా ప్రకటనలు జారీ చేయడం ద్వారా ప్రభుత్వం పక్షులను సంరక్షించడం, వెట్‌ల్యాండ్స్‌ను పరిరక్షించడం, దేశ విదేశీ పర్యాటకులను ప్రధానంగా పక్షుల ప్రేమికులను ఆకర్షించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ అనేక సమావేశాలు, సెమినార్లు నిర్వహించడం జరిగింది.
అక్రమార్కుల చెరలో కొల్లేరు
ఫిబ్రవరి 2న ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఇరాన్ దేశంలోని రామ్సర్ అనే నగరంలో ఇటీవల ఒక సమావేశం జరిగింది. దీనిలో 116 దేశాలు పాల్గొన్నాయి. భారతదేశ ప్రతినిధులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని కొల్లేరు సరస్సు భారతదేశంలోనే అతిపెద్దదైన నీటితోని నిండిన చిత్తడి నేలను కలిగి ఉంది. కొల్లేరు సరస్సు వలస వచ్చే పక్షుల కారణంగా అంతర్జాతీయ ప్రాముఖ్యతను పొందింది. ఫిబ్రవరి 2, 2000న అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొల్లేరు సరస్సును పక్షులు, వన్యప్రాణులకు రక్షిత ప్రాంతంగా ప్రకటిస్తూ జీవో నెం 120ని జారీ చేసింది. ఈ నేపథ్యంలో చిత్తడి నేల పరిరక్షించుకోవడంతోపాటు పర్యావరణ వ్యవస్థలను అన్నివిధాలుగా సంరక్షించాలి. ఎన్జీవోలు, విద్యాసంస్థలు, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మీడియా ఆ దిశగా ప్రయత్నాలు చేయాలి. అయితే, నిబంధనలకు విరుద్ధంగా చేపల మాఫియా, రొయ్యల మాఫియా కొల్లేరు భూములను ఆక్రమించాయి. చేపల మాఫియా చేపల తొట్టెలను నిర్మించిన తరువాత జీవవైవిధ్యానికి భంగం కలుగుతోంది.
వెట్ల్యాండ్స్తో పర్యావరణ పరిరక్షణ
చిత్తడి భూములు అంటే సీజన్లతో సంబంధం లేకుండా ఏడాది పొడవునా నీరు పుష్కలంగా నిలిచి ఉంటుంది. వెట్ల్యాండ్స్తో ఆర్థిక, పర్యావరణపరంగా చాలా ఉపయోగాలు ఉన్నాయి. చిత్తడి భూములు వరదలను నియంత్రిస్తాయి. చిత్తడి భూములు నీటిని ఫిల్టర్ చేస్తాయి. వెట్‌ల్యాండ్స్ భూముల సారాన్ని పెంచుతాయి. ఔషధ మొక్కల పెరుగుదలకు చిత్తడి నేలలు ఉపయోగపడతాయి. భూగర్భంలో నీటి శాతాన్ని పెంచుతాయి. దీంతో నీరు ఎక్కువ కాలం నిలిచి ఉంటుంది. ప్రధానంగా పక్షులు నీరు సమృద్ధిగా ఉండే చిత్తడి ప్రాంతాలలో ఉండటానికి ఇష్టపడతాయి. ఈజిప్ట్, నైజీరియన్, ఆస్ట్రేలియా, ఇండోనేషియా, సైబీరియా నుంచి అనేక పక్షులు కొల్లేరు సరస్సుకు వస్తాయి. ప్రపంచంలోని నలభై శాతం పెలికాన్ పక్షులు కొల్లేరు సరస్సులో గుమిగూడతాయి. కొల్లేరు సరస్సు ప్రాంతంలో సుమారుగా 182 రకాల పక్షులు ఉంటాయి. కానీ, ఆశ్చర్యకరంగా ఈ వెట్‌ల్యాండ్స్ ఆక్రమణదారుల కారణంగా కనుమరుగవుతున్నాయి. ఈ చిత్తడి భూములు దాని ఉపయోగాలపై లోతైన అధ్యయనం తర్వాత, దేశంలోని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మూడు నెలల్లోపు చేపల తొట్టెలను తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తీర్పు ఇచ్చింది. చేపల మాఫియా కౌంటర్ పిటిషన్ దాఖలు చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తోంది.
పక్షుల ప్రేమికులను ఆకర్షించే ఏర్పాట్లు చేయాలి
రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు పర్యాటకులను ముఖ్యంగా పక్షి ప్రేమికులను ఆకర్షించడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలి. వసతి, తాగునీరు, రవాణా సౌకర్యాలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలి. విజయవాడలో ఇటీవల వచ్చిన వరదలకు ప్రధాన కారణం చిత్తడి నేలల ఆక్రమణ , కొల్లేరు సరస్సు ఆక్రమణ అని చెప్పడం ప్రస్తుతం సందర్భోచితం. కాగా, దక్షిణ అమెరికాలోని ఒక చిన్న దేశం పెరూ. ఈ దేశం గురించి ఇక్కడ వాస్తవాలను ప్రస్తావించడం సముచితం. పెరూ పశ్చిమ తీర ప్రాంతంలో, అంటే పారకాస్ తీర ప్రాంతంలోని వెట్‌ల్యాండ్స్ అనేక సముద్ర పక్షులు, సీ లైన్స్, సముద్ర జీవులు, తడి భూములకు ఆకర్షితులవుతున్నాయి. పెరువియన్ ప్రభుత్వం ఈ జీవుల విసర్జాలను మానవీయంగా సేకరించి ఇతర దేశాలకు ఎగుమతి చేసి భారీ మొత్తంలో ఆదాయాన్ని పొందుతోంది. గ్వానే కార్మోరాంట్ ఒక ముఖ్యమైన పక్షి. ఈ పక్షి ఆహారం తిన్న తరువాత విసర్జించే వ్యర్థమలం నత్రజని, పొటాషియం, భాస్వరం వంటి అనేక పదార్థాలను కలిగి ఉంటుంది.
ఇది అద్భుతమైన సేంద్రీయ ఎరువు. ఈ ‘వైట్ గోల్డ్’ పెరువియన్ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సేంద్రీయ ఎరువులు యూరప్, ఉత్తర అమెరికాతోపాటు కొన్ని ఆసియా దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. పెరూ లాంటి చిన్న దేశం పక్షుల విసర్జనను సేకరించడం ద్వారా తన ఆర్థిక వ్యవస్థను ఇబ్బడి ముబ్బడిగా పెంచుకోగలిగితే, మనలాంటి దేశం చిత్తడి భూములను అనేక ప్రయోజనాల కోసం ఎందుకు ఉపయోగించకూడదు. వెట్‌ల్యాండ్స్ కాపాడుకోవాలంటే అవసరమైనది నిజాయితీ. చేపల మాఫియాల వ్యక్తిగత ప్రయోజనాల కంటే జాతీయ ప్రయోజనాలకు పెద్దపీట వేసి అధిక ప్రాధాన్యమివ్వాలి. చిన్న దేశమైన పెరూ జీవవైవిధ్యం, పర్యావరణ సమతుల్యతను చక్కగా కాపాడుకుంటోంది. మరి భారతదేశం వెట్‌ల్యాండ్స్‌ను దేశ ప్రయోజనాల కోసం ఎందుకు
ఉపయోగించుకోకూడదో యోచించాలి.
- డా. కె.నారాయణ,జాతీయ కార్యదర్శి,
సీపీఐ