వీరజవాన్ నీరడి గంగా ప్రసాద్​కు కన్నీటి వీడ్కోలు

  •       అధికార లాంఛనాలతో అంత్యక్రియలు, పాల్గొన్న కలెక్టర్, సీపీ
  •      జనసంద్రమైన కుమ్మన్​పల్లి 

బోధన్​,వెలుగు: సిక్కిం వరదల్లో చిక్కుకొని మృతి చెందిన బోధన్ ​మండలం కుమ్మన్​పల్లి వీరజవాన్​ నీరడి గంగా ప్రసాద్ వివిధ రాజకీయ పార్టీల లీడర్లు, గ్రామస్తులు, యువకులు, పోలీసులు అధికార లాంఛనాలతో కన్నీటి వీడ్కోలు పలికారు. గంగాప్రసాద్​ పార్థివ దేహం ఉదయం 9:30 గంటలకు బోధన్​ శివారులోని ఆచన్​పల్లికి చేరుకుంది.

బోధన్, సాలూరా, ఎడపల్లి మండలాలకు చెందిన ప్రజలు తండోపతండాలుగా చేరుకొని పార్థివ దేహానికి జాతీయ జెండాలతో స్వాగతం పలికారు. బోధన్​ నుంచి కుమ్మన్​పల్లి వరకు భారీ బైక్​ర్యాలీ నిర్వహించారు. కలెక్టర్ రాజీవ్ ​గాంధీ హన్మంతు, సీపీ సత్యనారాయణ, బోధన్​ ఆర్డీవో  రాజాగౌడ్ తదితరులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. నిరుపేద కుటుంబానికి చెందిన నీరడి స్వరూప, కాశీరాం దంపతులకు ఇద్దరు కుమారులు కాగా, పెద్దకొడుకు గంగాప్రసాద్ ​ఎనిమిదేండ్ల కింద సైన్యంలో చేరాడు. నాలుగు నెలల కింద గ్రామానికి వచ్చినప్పుడు, మళ్లీ దసరాకు వస్తానని చెప్పి తిరిగి రాని లోకాలకు వెళ్లాడంటూ కుటుంబ సభ్యులు కంటతడి పెట్టడం అందరినీ కలిచివేసింది. గంగాప్రసాద్​కు భార్య షిరీషా, ఇద్దరు కొడుకులు ఉన్నారు.