- ఆదివాసీల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
- కుమ్రంభీం వర్ధంతి, దర్బార్ సభలో మంత్రి సీతక్క
ఆసిఫాబాద్ వెలుగు : జల్..జంగల్.. జమీన్ కోసం నైజాం నవాబులపై తిరుగుబాటు చేసి అసువులు బాసిన ఆదివాసీ వీరుడు కుమ్రం భీం పోరాట స్ఫూర్తి, స్వయం పాలన ఎప్పటికీ చరిత్రలో నిలిచి ఉంటాయని రాష్ట్ర గిరిజన సంక్షేమ, పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి , స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి సీతక్క పేర్కొన్నారు. తెలంగాణ సాధనకు కూడా భీం స్ఫూ ర్తి అని గుర్తుచేశారు. రాబోయే రోజుల్లో ఆ వీరుడి స్మృతి వనం మహోన్నత టూరిస్ట్ స్పాట్ కానుందని తెలిపారు. గురువారం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం జోడేఘాట్ లో కుమ్రంభీం 84వ వర్ధంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.
ముందుగా భీం విగ్రహానికి, సమాధికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన దర్బార్ లో మంత్రి సీతక్క మాట్లాడారు. పీసా, 1/70 చట్టాలు రావడానికి కుమ్రంభీం, రాంజీ గోండ్, బిర్సా ముండే వంటి ఆదివాసీ పోరాట వీరులే కారణమని గుర్తుచేశారు. ఆదివాసీ గిరిజనులు భూమి, భుక్తి కోసం చేసిన పోరాటాన్ని గుర్తించి హైమన్ డార్ఫ్ పరిశోధన ఫలితంగా ఆదివాసీలకు హక్కులు, ప్రత్యేక చట్టాలు రూపొందించారని పేర్కొన్నారు. ఐటీడీఏలు గత పాలకుల నిర్వాకంతో నిర్వీర్యమయ్యాయని, కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత పూర్తి నిర్లక్ష్యం చేశారని విమర్శించారు.
తమ ప్రభుత్వం వచ్చాక గిరిజన ఎమ్మెల్యేలతో కలిసి ఐటీడీఏల పరిస్థితిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లామని, దీంతో స్వయం ప్రతిపత్తి కల్పనతో పాటు రూ. కోట్ల నిధులు ఇచ్చేందుకు చొరవ చూపారని చెప్పారు. ఆదివాసీల విషయంలో అధికారులు, పాలకులు ఆలోచనతో పని చేయాలని కోరారు. పోడు రైతులపై ఫారెస్ట్ ఆఫీసర్లు అతిగా వ్యవహరించడం, అత్యుత్యాహం చూపొద్దని సూచించారు. అడవికి నష్టం జరిగే పరిస్థితి వస్తే ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఫారెస్ట్ ఆఫీసర్లు చొరవ తీసుకుని ముందుకెళ్లాలని కోరారు.
ఇందిరమ్మ ఇండ్ల కోటా కూడా ప్రత్యేకంగా ఐటీడీఏలకు ఇవ్వనున్నట్లు చెప్పారు. జోడేఘాట్ అభివృద్ధికి టూరిజం శాఖ నుంచి రూ. 6 కోట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు మంజూరు చేశారని ప్రకటించారు. ఇంచు భూమి కూడా ఆక్రమణ కాకుండా స్థానిక12 గ్రామాల్లోని ఆదివాసీ గిరిజనులతో కమిటీ ఏర్పాటు చేయాలని కలెక్టర్, పీఓకు మంత్రి సూచించారు. ఉట్నూర్ ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా జోడేఘాట్ లో దర్బార్ లో గొండి భాషలో మాట్లాడి ఆకట్టుకున్నారు. కుమ్రంభీం జీవిత చరిత్రపై చిత్రీకరించిన షార్ట్ ఫిలిం సీడీని ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి ఆవిష్కరించారు.
సాంస్కృతిక సారథి కళాకారులు, విద్యార్థుల నృత్య ప్రదర్శనలు, పాటలు అలరించాయి. కార్యక్రమంలో ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్ , ఎమ్మెల్సీ దండే విఠల్, కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే, రామగుండం సీపీ శ్రీనివాస్, ఎస్పీ డీవీ శ్రీనివాసరావు, అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి, కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లా, ఆసిఫాబాద్, సిర్పూర్, ఖానాపూర్, మంచిర్యాల ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, పాల్వాయి హరీశ్ బాబు, వెడ్మ బొజ్జు, కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, జీసీసీ చైర్మన్ కొట్నాక తిరుపతి, కుమ్రంభీం మనుమడు కుమ్రం సోనే రావు, వర్ధంతి ఉత్సవ కమిటీ చైర్మన్ పెందూర్ రాజేశ్వర్, గిరిజన సంఘాల నేతలు పాల్గొన్నారు.