గట్టివానలు పడితే.. ‘కుమ్రంభీం’ కష్టమే..పగుళ్లు తేలి కుంగిపోతున్న ప్రాజెక్టు కట్ట

గట్టివానలు పడితే.. ‘కుమ్రంభీం’ కష్టమే..పగుళ్లు తేలి కుంగిపోతున్న ప్రాజెక్టు కట్ట
  •     గతేడాది వానలకు ఆనకట్ట తడువకుండా  కవర్లతో కప్పిన ఆఫీసర్లు
  •     అప్పట్నుంచి ఇప్పటివరకూ రిపేర్లు లేవు..
  •     దగ్గరకొస్తున్న వానాకాలం..   పట్టించుకోని ప్రభుత్వం

ఆసిఫాబాద్, వెలుగు :  ఆసిఫాబాద్,  సిర్పూర్  నియోజకవర్గాల్లోని  బీడుభూములకు సాగునీరు అందించేందుకు 2005లో అప్పటి  కాంగ్రెస్  ప్రభుత్వం 10  టీఎంసీల కెపాసిటీతో  నిర్మించిన కుమ్రంభీం ప్రాజెక్ట్​  ప్రమాదపుటంచులో ఉంది.    నిరుడు కురిసిన పెద్ద వానలకు  ప్రాజెక్ట్  ఆనకట్ట  బీటలు వారింది.  ఆలస్యంగా స్పందించిన ఆఫీసర్లు  గేట్లు ఎత్తి వేసి నీటిని వదిలారు.  మరింత కుంగిపోకుండా కట్టపై పాలిథీన్​ కవర్లు  కప్పి ఎలాగోలా  ముంపు తప్పించారు.  అయితే ఇప్పటివరకూ రిపేర్లు చేయకపోవడంతో గట్టివానలు  కొడితే  ప్రాజెక్ట్  మనుగడ కష్టమేనని ఆయకట్టు రైతులు వాపోతున్నారు. 

మరింత పగుళ్లు.. పట్టించుకోని సర్కార్​

జిల్లాలోని 45 ,500 ఎకరాలకు  సాగునీరు అందించే లక్ష్యంతో ఆడ గ్రామంలో  పెద్ద వాగుపై ఈ ప్రాజెక్టును నిర్మించారు. నిరుడితో పోలిస్తే ఆనకట్టకు వంద మీటర్ల వరకు  బీటలు వారి,  పగుళ్లు తేలి మరింత కుంగింది.  ప్రాజెక్ట్ పరిస్థితి  ఆందోళనకరంగా మారినా ప్రభుత్వం రిపేర్ల కోసం ఒక్క పైసా ఇవ్వకపోవడంపై  రైతులు మండిపడ్తున్నారు.  2014లో  తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి  వచ్చిన తర్వాత ప్రత్యేక రాష్ట్రంలో  ప్రాజెక్ట్ కు మహర్దశ వస్తుందని భావించారు.  ప్రభుత్వం అసలే పట్టించుకోకపోవడంతో  ప్రాజెక్టు మనుగడే కష్టమైందని ఆరోపిస్తున్నారు.  పగుళ్లు తేలి ఏడాది గడుస్తున్నా,  కట్టకు రిపేర్లతో పాటు కెనాల్స్, పిల్ల కాల్వలు పూర్తి చేయలేదని చెప్తున్నారు.

భగీరథ నీటికి కష్టమే..


జిల్లాలో  సాగునీరు, తాగునీటికి ఈ ప్రాజెక్టే  పెద్ద దిక్కు.  2  టీఎంసీల నీటిని ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలోని వేలాది గ్రామాలకు సప్లై చేస్తున్నారు.  రానున్న  వానాకాలంలో వరద నీటితో ప్రాజెక్టు 10 టీఎంసీలకు చేరితే ఇబ్బందులు తలెత్తే  చాన్స్​ ఉందని  నిపుణులు చెప్తున్నారు. జిల్లాలో  2 టీఎంసీల నీటిని మిషన్ భగీరథ కు  వాడుకునే వీలుంది.  
ప్రస్తుతానికి  60 శాతం నీటి సామర్థ్యం మాత్రమే ఉండడంతో ఇరిగేషన్ ఆఫీసర్లు కూడా  చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు.  

సర్కార్ పట్టించుకుంటలేదు..

కుమ్రంభీం ప్రాజెక్ట్  కట్టి ఏండ్లు గడుస్తున్నా  కాల్వల నిర్మాణం పూర్తి కాలె.  నాకు 8 ఎకరాల భూమి ఉంది కానీ వర్షాధార  పంటలే సాగు చేయాల్సిన పరిస్థితి.  నిరుడు ప్రాజెక్ట్ కట్ట పగుళ్లు తేలి కుంగిపోతే ఇప్పటికీ కూడా  ఎవరూ  పట్టించుకుంటలేరు. ప్రాజెక్టు ప్రమాదంలో ఉంది..  ఏదైనా జరిగితే ముందుగా నష్ట పోయేది మా ఖిరిడి గ్రామమే.. ఇప్పటికైనా సర్కార్​ పట్టించుకోవాలె.
- వసాకే బాబాజీ , రైతు, ఖిరిడి ,ఆసిఫాబాద్

సాయిల్ టెస్ట్ రిపోర్ట్ రాగానే ప్రపోజల్స్​​

కుమ్రంభీం ప్రాజెక్టు ఆనకట్ట పగుళ్లు తేలడంపై  ఇప్పటికే ఎక్స్​పర్ట్స్​ కమిటీకి  నివేదించాం. సాయిల్ టెస్ట్ కోసం హైదరాబాద్ ల్యాబ్ కు పంపించాం.  రిపోర్ట్ రాగానే  నిధుల సాంక్షన్​ కోసం ప్రభుత్వానికి ప్రపోజల్స్​ పెడ్తాం.

గుణవంత్ రావు , ఇరిగేషన్ ఈఈ

ఇంకా కాల్వలు పూర్తి కాలె..

2005లో  ప్రాజెక్ట్ పనులు  ప్రారంభించి 2007లో పూర్తి చేశారు.  2011నవంబర్​లో  అప్పటి  సీఎం కిరణ్ కుమార్ రెడ్డి   కాల్వల పనులు పూర్తి కాకుండానే  జాతికి అంకితం చేశారు .  రూ. 270 కోట్ల అంచనా ఖర్చుతో ప్రారంభించగా.. ఇప్పుడు ప్రాజెక్టు అంచనా ఖర్చు రూ.882 కోట్లకు పెరిగింది.  ఇప్పటి వరకు  రూ.751  కోట్ల వరకు ఖర్చు చేశారు.  కెనాల్ పనులు పూర్తయితేనే 45, 500ఎకరాలకు సాగు నీరు అందనుంది. 2012 నాటికి  ప్రాజెక్టు కాల్వలు  పూర్తిచేసి ఆయకట్టుకు నీరందిస్తామని అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ప్రకటించినా  నేటికీ కాల్వలు  పూర్తి కాలేదు. ప్రాజెక్టులో నీళ్లు పుష్కలంగా ఉన్నా  కాల్వల నిర్మాణం పూర్తికాకపోవడంతో పొలాలకు సాగునీరు అందడం లేదు.