సీఎం రేవంత్​కు భువనగిరి గిఫ్ట్ .. మాట నిలబెట్టుకున్న బ్రదర్స్​

యాదాద్రి, వెలుగు : సీఎం రేవంత్​రెడ్డికి ఇచ్చిన మాటను కోమటిరెడ్డి బ్రదర్స్​నిలబెట్టుకున్నారు. అన్నట్టుగానే  చామల కిరణ్​కుమార్​రెడ్డిని గెలిపించి భువనగిరి ఎంపీ సీటును సీఎం రేవంత్​కు గిఫ్ట్​గా ఇచ్చారు. మంత్రి కోమటిరెడ్డి చెప్పిన విధంగానే 5 లక్షలకు పైగా మెజార్టీతో నల్గొండ ఎంపీగా రఘువీర్​రెడ్డిని గెలిపించుకున్నారు. భువనగిరి ఎంపీ అభ్యర్థిగా చామల కిరణ్​కుమార్​రెడ్డిని ఎంపిక చేసిన తర్వాత మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి ఇంటికి సీఎం రేవంత్​రెడ్డి స్వయంగా వెళ్లిన సంగతి తెలిసిందే.

అనంతరం భువనగిరి నియోజకవర్గ ఇన్​చార్జిగా కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. అనంతరం ఏప్రిల్​21న నియోజకవర్గం కేంద్రమైన భువనగిరిలో నిర్వహిచిన రోడ్​షోకు సీఎం రేవంత్​రెడ్డి వచ్చారు. ఆ సమయంలోనే మా తమ్ముడు చామలను గెలిపించుకుంటామని కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి ప్రకటించారు. సీఎం రేవంత్​రెడ్డికి తాము కుడి, ఎడమ భుజాలుగా ఉంటామని తెలిపారు. భువనగిరి ఎంపీ సీటును గెలిపించుకొని సీఎం రేవంత్​కు గిఫ్ట్​గా ఇస్తామని ప్రకటించారు. ఇచ్నిన హామీకి తగ్గట్టుగానే ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్​ రెడ్డి అన్నీ తానై ఎన్నికల ప్రచారం నిర్వహించారు.