మునుగోడులో జరగబోయేది ఉప ఎన్నిక కేసీఆర్ కుటుంబం, మునుగోడు ప్రజల మద్య జరిగే యుద్ధమని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ప్రజల కోసం పదవీత్యాగం చేసిన తనకు మద్దతిస్తున్న దేవులమ్మ నాగారం ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఏ గ్రామానికి వెళ్లినా పార్టీలకతీతంగా బీజేపీకి జై అంటున్నారని చెప్పారు. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్ర బంగారు భవిష్యత్తుకు బాటలు వేసే అవకాశం మునుగోడు ప్రజలకు వచ్చిందని అభిప్రాయపడ్డారు.
1200మంది ఆత్మహత్యలు చేసుకుంటే ఆ ప్రాణ త్యాగాల మీద వచ్చిన రాష్ట్రం వల్ల కేవలం కేసీఆర్ కుటుంబానికి మేలు జరిగిందని రాజగోపాల్ రెడ్డి అభిప్రాయపడ్డారు. కేసీఆర్ హయాంలో రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అన్నదే లేకుండా పోయిందని వాపోయారు. కాంగ్రెస్ నుంచి గెలిచిన 12 మందిని టీఆర్ఎస్లోకి గుంజుకున్నా ప్రశ్నించే గొంతు లేకుండా చేశాడని మండిపడ్డారు. రాష్ట్రంలో రాక్షస, నియంత పాలన పోవాలంటే బీజేపీ అధికారంలోకి రావాలని పిలుపునిచ్చారు.
బెల్టు షాపుల ద్వారా ఎన్నో కుటుంబాలను కేసీఆర్ నాశనం చేస్తున్నారని, మద్యం ద్వారా రూ.36 కోట్ల ఆదాయం సృష్టించి ఆ మొత్తాన్నే రైతు బంధు ఇస్తున్నాడని విమర్శించారు. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి వార్డు మెంబర్కు ఎక్కువ సర్పంచ్కు తక్కువని అభిప్రాయపడ్డారు. కేసీఆర్ కు దమ్ముంటే మునుగోడులో పోటీ చేయాలని డిమాండ్ చేశారు. మూడున్నరేండ్లుగా అభివృద్ధి కోసం ఎంత కొట్లాడినా కేసీఆర్ వివక్ష చూపిస్తున్నాడని, ఆత్మగౌరవంపై దెబ్బకొడుతున్నందుకే రాజీనామా చేశానని రాజగోపాల్ స్పష్టం చేశారు.