కేసీఆర్ అహంకారానికి ప్రజలకు మధ్య యుద్ధమిది

మునుగోడులో ధర్మం గెలుస్తుందని, కేసీఆర్ పతనం అక్కడి నుంచే ప్రారంభమైతదని బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. బీజేపీ మునుగోడు సమరభేరీ సభలో మాట్లాడిన ఆయన... కేసీఆర్ సర్కారుపై నిప్పులు చెరిగారు. రాష్ట్రం మోసకారి, దగా కోరు, నయవంచక కుటుంబం చేతిలో చిక్కి విలవిల్లాడుతోందని ఆరోపించారు. తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని  రాజగోపాల్ అభిప్రాయపడ్డారు. ప్రజల మీద విశ్వాసంతోనే పదవికి రాజీనామా చేశానన్న ఆయన.. తనను గెలిపించిన ప్రజలకు న్యాయం చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. సీఎం కేసీఆర్ ను గద్దె దింపి రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పాల్సిన అవసరం ఉందని రాజగోపాల్ అభిప్రాయపడ్డారు. 

చారిత్రక తీర్పు ఇవ్వాలె
రాష్ట్రంలో కుటుంబ పాలనకు వ్యతిరేకంగా యుద్దం జరుగుతోందని రాజగోపాల్ రెడ్డి అన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎన్నిసార్లు సీఎం కేసీఆర్ అపాయింట్మెంట్ కోరినా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మునుగోడు ఉప ఎన్నిక వ్యక్తుల మధ్య జరిగే యుద్ధం కాదని, కేసీఆర్ అహంకారానికి తెలంగాణ ప్రజల మధ్య జరుగుతున్న యుద్ధమని రాజగోపాల్ చెప్పారు. ప్రజలు చారిత్రక తీర్పు ఇచ్చి టీఆర్ఎస్ను బొందపెట్టాలని రాజగోపాల్ పిలుపునిచ్చారు.

కేసీఆర్కు నిద్ర పడ్తలేదు
పార్టీలు మారేటప్పుడు చాలా మంది నేతలు నైతిక విలువలు వదిలేస్తున్నారని కానీ తాను మాత్రం పదవికి రాజీనామా చేసి మరీ బీజేపీలో చేరానని రాజగోపాల్ అన్నారు. బాయిల కాడ మోటర్లకు మీటర్లు పెడ్తరని రైతులను కేసీఆర్ బెదిరిస్తున్నడని మండిపడ్డారు. తాను అమిత్ షాను కలిసి వచ్చిన నాటి నుంచి కేసీఆర్ కు నిద్రపడ్తలేదని అన్నారు. రాష్ట్రంలో పాలన అవినీతిమయంగా మారిందన్న రాజగోపాల్ రెడ్డి.. కేసీఆర్ దోచుకున్నదంతా కక్కిస్తామని హెచ్చరించారు.

అమిత్ షా సమక్షంలో పార్టీలో చేరిక

అంతకు ముందు మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరారు. మునుగోడు సమరభేరి సభ వేదికగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమక్షంలో కమలంపార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అమిత్ షా కాషాయ కండువా కప్పి ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు.

రాజగోపాల్ రెడ్డి రాజకీయ ప్రస్థానం

  • కాంగ్రెస్ పార్టీతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు.
  • 2009లో భువనగిరి లోక్ సభ సభ్యుడిగా పోటీ చేసిన రాజగోపాల్ రెడ్డి... సీపీఎం అభ్యర్థి నోముల నర్సింహయ్యపై పై 1,39,978 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
  • 2016 నుంచి 2018 వరకు శాసనమండలి సభ్యుడిగా పనిచేశారు.
  • 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు శాసనసభ ఎన్నికల్లో మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి... టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిపై 22,552 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.  
  • కాంగ్రెస్ రాష్ట్ర  నాయకత్వంపై, పార్టీ పరిస్థితిపై  విశ్వాసం కోల్పోయిన రాజగోపాల్ రెడ్డి... టీఆర్ఎస్ ప్రభుత్వంపై పోరాడేందుకు కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్లిపోతున్నట్లు ప్రకటించారు.
  • ఈ క్రమంలోనే  ఈ నెల 2న కాంగ్రెస్‌కు, ఎమ్మెల్యే పదవికి ఆయన రాజీనామా చేశారు.
  • ఇవాళ అమిత్ షా సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్న రాజగోపాల్ రెడ్డి... మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు.