మర్రిగూడ, వెలుగు: చర్లగూడెం ప్రాజెక్టులో భూములు కోల్పోయిన నిర్వాసితులకు తన రాజీనామాతోనే పది రోజుల్లో పరిహారం వచ్చిందని మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. తన రాజీనామాతోనే నియోజకవర్గానికి రూ.570 కోట్లు వచ్చాయని చెప్పారు. సోమవారం నియోజకవర్గంలోని మర్రిగూడ మండలం అజిలాపురం, తిరగండ్లపల్లి, తమ్మడపల్లితో పాటు వివిధ గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఎందరో ఆత్మబలిదానాలతో కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో సీఎం కేసీఆర్ కుటుంబం, అధికార పార్టీ నాయకులే బాగుపడ్డారని ఆయన మండిపడ్డారు. కేసీఆర్ ను గద్దె దించడానికే ఆరోజు తాను బీజేపీలో చేరానని, కానీ తన ఉద్దేశం నెరవేరకపోవడంతో ఈరోజు బీఆర్ఎస్ ను బొంద పెట్టడానికి మళ్లీ కాంగ్రెస్ లోకి వచ్చానని తెలిపారు. కేసీఆర్ నియంత, రాచరిక పాలన అంతం కాంగ్రెస్ తోనే సాధ్యమవుతుందన్నారు. రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని, ఎన్నికల్లో 90 సీట్లు గెలుచుకొని అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు.
డిసెంబర్ 3 తర్వాత బీఆర్ఎస్ మూడు ముక్కలవుతుందని, కవిత ఒకవైపు, కేటీఆర్ ఒకవైపు, హరీశ్ రావు ఒకవైపు ముక్కలుకాక తప్పదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని పేర్కొన్నారు. కేసీఆర్ గారడీ మాటలకు మోసపోకుండా తనను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకువెళ్లి సస్యశ్యామలం చేసి చూపిస్తానని రాజగోపాల్ రెడ్డి హామీ ఇచ్చారు.