మునుగోడులో ఒక్క బెల్టు షాపు కనిపించొద్దు : కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి

  • వారం రోజుల్లో అన్ని మూసేయాలి
  • ఎక్సైజ్​ ఆఫీసర్లకు ఎమ్మెల్యే రాజగోపాల్​రెడ్డి ఆదేశం
  • ఎమ్మెల్యే ఆదేశాలతో ఆబ్కారోళ్ల మల్లగుల్లాలు
  • డిసెంబర్ 1 నుంచే మొదలైన కొత్త లైసెన్సీల వ్యాపారం

నల్గొండ, వెలుగు :  తన నియోజకవర్గంలో బెల్టుషాపులన్నింటినీ మూసేయాలని, ఇందుకు వారం రోజులే గడువు ఇస్తున్నానని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి ఎక్సైజ్ ఆఫీసర్లకు హుకుం జారీ చేశారు. కాంగ్రెస్​ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్రంలో బెల్టుషాపులు మూసేస్తామని ఆ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై సర్కారు ఇంకా విధానపరమైన నిర్ణయం తీసుకోలేదు. ఈలోగా మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్​రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. నల్గొండ, యాదాద్రి జిల్లాల్లోని ఎక్సైజ్​ఆఫీసర్లతో తన క్యాంప్​ ఆఫీసులో ఇటీవల భేటీ అయిన ఎమ్మెల్యే.. మునుగోడు నియోజకవర్గం పరిధిలోని చౌటుప్పుల్​నుంచి నాంపల్లి మండలం వరకు ఎక్కడా ఒక్క బెల్టుషాపు కూడా కనిపించడానికి వీల్లేదని ఆదేశించారు. బెల్టుషాపుల వల్ల జనం మద్యానికి బానిసై అనేక కుటుంబాలకు వీధిన పడుతున్నాయని, మహిళల బతుకులు ఆగమవుతున్నాయని గుర్తు చేశారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు తన నియోజకవర్గంలో బెల్టుషాపుల జాడ లేకుండా చేస్తానని ఆయన స్పష్టం చేశారు. 

40 శాతం ఆదాయం లాస్​ ?

లిక్కర్​సేల్స్​ద్వారా ప్రభుత్వానికి ఏటా రూ.36 వేల కోట్ల ఆదాయం వస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా12,769 గ్రామాలు ఉన్నాయి. ప్రతి గ్రామంలో కనీసం ఐదు నుంచి పది వరకు బెల్టుషాపులు నడుస్తున్నాయి. ఈ లెక్కన రాష్ట్రంలో ఏం తక్కువ లక్ష దాకా బెల్టుషాపులు ఉండొచ్చని ఎక్సైజ్ అధికారుల అంచనా. ఇటీవల ఎన్నికల కోడ్​వల్ల బెల్టుషాపులు బంద్​చేశారు. కొత్త లైసెన్సీల వ్యాపారం డిసెంబర్1 నుంచి మొదలైంది. కాబట్టి మళ్లీ కొత్తగా బెల్టుషాపులతో అగ్రిమెంట్లు జరుగుతున్నాయి. హోల్​సేల్, రిటైల్​పేరుతో రెండు రకాల లిక్కర్​దందా నడుస్తోంది. కాంగ్రెస్​ప్రభుత్వం అధికారంలోకి వస్తే బె ల్టుషాపులు మూసేస్తాని ఆ పార్టీ మేనిఫెస్టోలో చేర్చింది. ఎన్నికల హామీ మేరకు గ్రామాల్లో బెల్టుషాపులు తీసేస్తే ప్రభుత్వానికి ఏటా సుమారు రూ.16 వేల కోట్ల ఆదాయం తగ్గొచ్చని ఎక్సైజ్​ ఉన్నతాధికారి ఒకరు ‘వెలుగు’తో చెప్పారు. 

అయోమయంలో ఆబ్కారీ ఆఫీసర్లు..

ఎమ్మెల్యే ఆదేశాలతో నల్గొండ, యాదాద్రి జిల్లాల ఆబ్కారీ ఆఫీసర్లు తలపట్టుకుంటున్నారు. డిసెంబర్​ఒకటో తేదీ నుంచే రాష్ట్ర వ్యాప్తంగా 2,618 కొత్త షాపులు తెరుచుకున్నాయి. ఎన్నికల కోడ్​ వల్ల షాపులు తెరవడం కాస్త ఆలస్యమైంది. లిక్కర్​వ్యాపారు లు, బెల్టుషాపుల నిర్వాహకులతో ఇప్పుడిప్పుడే ఒప్పందాలు చేసుకుంటున్నారు. మునుగోడు నియోజకవర్గంలో 159 గ్రామాలు ఉండగా, ఒక్కో గ్రామంలో కనీసం ఐదారు బెల్టుషాపులు నడుస్తున్నాయి.

బెల్టుషాపుల వల్లే మద్యం బిజినెస్​జోరుగా నడుస్తోంది. వీటివల్లే వ్యాపారులకు రెండింతల లాభాలు వస్తున్నాయి. ఎవరికి ముట్టాల్సిన వాటా వారికి చేరుతున్నది. బెల్టుషాపులు ఉంటేనే సేల్స్​పెరిగి, ఆదాయం భారీగా వస్తుందని అధికారులు చెబుతున్నారు. ఎమ్మెల్యే రాజగోపాల్​రెడ్డి ఆదేశాల మేరకు బెల్టుషాపులు బంద్​చేయాలంటే పై నుంచి ఆదేశాలు రావాలని అధికారులు అంటున్నారు. దీని పైన స్టేట్ మొత్తానికి కలిపి ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వాల్సి ఉంటుందని చెబుతున్నారు.