- యాదాద్రిలో ప్రమాణం చేస్తా.. నువ్వు, నీ కొడుకు చేస్తరా?
- మంత్రి పదవి ఇస్తానన్నా టీఆర్ఎస్‌లోకి రాజగోపాల్ పోలే: బండి సంజయ్
- కేసీఆర్ కుటుంబ అవినీతికి మీటర్లు పెడ్తం: కిషన్ రెడ్డి
- పైసల కోసం ఎమ్మెల్సీ పదవులు అమ్ముకున్న కేసీఆర్: వివేక్
నల్గొండ, వెలుగు: ‘‘కాంట్రాక్టుల కోసం బీజేపీకి నేను అమ్ముడుపోయినట్లు నిరూపిస్తవా? నేను తప్పు చేయలేదని నువ్వు కట్టించిన యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి గర్భగుడిలో తడిబట్టలతో ప్రమాణం చేస్తా. నువ్వు, నీ కొడుకు కేటీఆర్ ప్రమాణం చేస్తరా?’’ అని సీఎం కేసీఆర్‌కు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సవాల్ విసిరారు. మునుగోడు బైపోల్ బీజేపీ అభ్యర్థిగా సోమవారం చండూరులో ఆయన నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర ఇన్‌చార్జ్ తరుణ్‌చుగ్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, మునుగోడు ఉప ఎన్నిక స్టీరింగ్ కమిటీ చైర్మన్ వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్‌రావు, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మనోహర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.
భారీ సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘నేను చేసే వ్యాపారం ఏదైనా పారదర్శకంగానే ఉంటుంది తప్పా.. అవినీతి, అక్రమాలకు ఆస్కారం ఉండదు. మునుగోడులో రాజకీయంగా నన్ను ఎదుర్కోలేక, ఇక్కడి ప్రజలు నన్ను గెలిపిస్తారనే అసూయతో అసత్య ఆరోపణలు చేస్తున్నారు. నేను తప్పు చేసినట్లు రుజువు చేస్తే ఏ శిక్షకైనా సిద్ధం. అవసరమైతే రాజకీయ సన్యాసం కూడా తీసుకుంటా. ఎన్నికల్లో పోటీ కూడా చేయను” అని స్పష్టం చేశారు. తనపై చేస్తున్న అవినీతి ఆరోపణలు నిరూపించడం కోసం కేంద్రంలోని ఏ దర్యాప్తు సంస్థతోనైనా విచారణ చేసుకోవాలని, లేదంటే ఆరోపణలు చేసిన వ్యక్తులపై కోర్టులో తేల్చుకుంటానని చెప్పారు. ఆస్తి, డబ్బు కోసం తాను పాకులాడే వ్యక్తిని కాదని, నిజంగా అమ్ముడుపోయే వ్యక్తినే అయితే 12 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినప్పుడే పోయేవాడినని, బీజేపీలోకి దొంగచాటుగా పోలేదని, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వెళ్లానని అన్నారు. మునుగోడు ప్రజలు తలదించుకునే పని తాను ఎన్నడూ చేయలేదని చెప్పారు.
కేసీఆర్ ఆఫర్లకు రాజగోపాల్ తలొగ్గలే: బండి సంజయ్
రాజగోపాల్ రెడ్డి కాంట్రాక్టుల కోసం అమ్ముడుపోయే వ్యక్తి కాదని బండి సంజయ్ అన్నారు. కేసీఆర్ మంత్రి పదవి ఆఫర్ చేసినా, కాంట్రాక్టులు ఇస్తానని ఆశ చూపినా ఆయన టీఆర్ఎస్లో చేరలేదని, కోమటిరెడ్డి కుటుంబం ఫస్ట్ నుంచి కాంట్రాక్టులు చేసేవారని చెప్పారు. రాజగోపాల్ రాజీనామాతోనే ఫామ్‌హౌస్‌లో పడుకున్న కేసీఆర్ లెంకలపల్లి దాకా దిగొచ్చారని అన్నారు. రాజగోపాల్ రాజీనామా తర్వాతే గట్టుప్పల్ మండలం వచ్చిందని, గొర్రెల పైసలు వచ్చాయని, వంద పడకల ఆసుపత్రి వచ్చిందని పేర్కొన్నారు. 2018 ఎన్నికల్లో డిండి లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేసి లక్ష ఎకరాలకు నీళ్లు ఇస్తామని చెప్పిన కేసీఆర్.. ఇప్పుడు ఎక్కడికి పోయారని ధ్వజమెత్తారు. వంద కోట్లు ఖర్చు పెట్టి విమానం కొనుగోలు చేసిన కేసీఆర్.. దుబయ్, ఇంగ్లండ్, మస్కట్‌లో అక్రమ సంపదంతా దాచిపెట్టారని ఆరోపించారు. చీకోటి ప్రవీణ్ స్కాం, లిక్కర్ స్కామ్‌ల మీద చర్చకు రావాలని సవాల్ చేశారు. సీపీఎం, సీపీఐ గుంటనక్కలు కేసీఆర్ పంచన చేరారని ఆరోపించారు. ఓటుకు రూ.40 వేలు చొప్పున పంచేందుకు టీఆర్ఎస్ రెడీ అయిందని, కానీ మునుగోడు ప్రజలు డబ్బుకు అమ్ముడపోయే వాళ్లు కాదని చెప్పారు.
ఆత్మగౌరవానికి, అహంకారానికి మధ్యే ఎన్నిక: కిషన్ రెడ్డి
తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి, కేసీఆర్ అహంకార వైఖరికి మధ్య ఈ ఉప ఎన్నిక జరుగుతున్నదని, రాష్ట్ర ప్రజల భవిష్యత్తును ఈ ఎన్నిక దిశా నిర్దేశం చేస్తుందని కిషన్‌రెడ్డి అన్నారు. కేసీఆర్ పాలనలో ఏం ఒరగబెట్టారని, పార్టీ నుంచి తెలంగాణ అనే పదం తొలగించి ప్రజల ఆత్మగౌరవం మీద దెబ్బకొట్టారని మండిపడ్డారు. ఉద్యమకారులను కేసీఆర్ పక్కకు పెట్టారని, రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు జరగనట్లు, నిరుద్యోగం లేనట్టు, అధికార దుర్వినియోగం జరగలేదన్నట్టుగా కొత్తగా తెరపైకి బీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చారని ఎద్దేవా చేశారు. ఇన్నేండ్లలో ఏం ఉద్ధరించి కొత్త పార్టీ పెట్టాల్సిన అవసరం వచ్చిందో చెప్పాలని సవాల్ విసిరారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను రంగంలోకి దింపి హుజూరాబాద్, దుబ్బాక తరహాలో ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని విమర్శించారు. కరెంటు మోటర్లకు మీటర్ల సంగతేమోగానీ, ఈ ఎన్నికతో కేసీఆర్ కుటుంబానికి మీటర్లు పెట్టే సమయం ఆసన్నమైందన్నారు.
ప్రలోభాలతో ఓట్లు కొనాలని చూస్తున్నరు: ఈటల
ప్రజలను ప్రలోభపెట్టి, డబ్బులతో ఓట్లు కొనాలని టీఆర్ఎస్ చూస్తున్నదని ఈటల రాజేందర్ ఆరోపించారు. ప్రజల నుంచి దోచుకున్న పైసల్నే ఇందుకు ఉపయోగిస్తున్నదని మండిపడ్డారు. కేసీఆర్ ముక్కు పిండి మరీ ఓటుకు లక్ష తీసుకుని రాజగోపాల్ రెడ్డికి ఓటు వేయాలన్నారు. హుజూరాబాద్ ఎన్నికల్లో బుద్ధి చెప్తేనే కేసీఆర్ ప్రగతి భవన్, ఫామ్ హౌస్ నుంచి మునుగోడుకు దిగొచ్చారని అన్నారు. మునుగోడు ఎన్నికల్లో బీజేపీ గెలిస్తేనే ప్రగతి భవన్ తలుపులు తీసి ఉంటాయని చెప్పారు.
కేసీఆర్‌కు మునుగోడు ప్రజలు బుద్ధి చెప్తరు: వివేక్ వెంకటస్వామి
ప్రజల సొమ్మును దోచుకుని విమానాలు కొంటున్న సీఎం కేసీఆర్‌కు మునుగోడు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని వివేక్ వెంకటస్వామి పిలుపునిచ్చారు. తాడిచర్ల మైనింగ్‌లో కేసీఆర్ వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని, దీనిపై సీబీఐ ఎంక్వైరీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. జెన్కో సంస్థను సర్వనాశనం చేశారని, పైసలు తీసుకుని ఎమ్మెల్సీ పదవులు అమ్ముకున్నారని ఆరోపించారు. లిక్కర్ స్కామ్‌లోనూ కేసీఆర్ కుటుంబం ఇరుక్కుందని వివేక్ మండిపడ్డారు. సేల్స్ పెంచడం ద్వారా 40 వేల కోట్ల ఆదాయం పెంచుకొని ప్రజలను తాగుబోతులను చేశారని విమర్శించారు.