మునుగోడు, వెలుగు : మునుగోడు ప్రజల తీర్పుతో సీఎం కేసీఆర్ దుకాణం బంద్ అవుతుందని, ఆయన పతనం ఇక్కడి నుంచే మొదలవుతుందని బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. శనివారం మునుగోడు, మర్రిగూడ మండలంలో ఆయన ప్రచారం నిర్వహించారు. కేసీఆర్ తెలంగాణ ఉద్యమకారులను అవమానించి టీఆర్ఎస్ నుంచి బయటకు పంపి, ఉద్యమ ద్రోహులతో తిరుగుతున్నారని రాజగోపాల్‌రెడ్డి మండిపడ్డారు.
‘‘నేను ఒక్కడిని రాజీనామా చేస్తే సీఎంతో సహా 15 మంది మంత్రులు, 86 మంది ఎమ్మెల్యేలు, 12 మంది ఎమ్మెల్సీలు, ఎంపీలు వచ్చి ప్రచారం చేస్తున్నారు. కేసీఆర్ రాజకీయాలకు విలువ లేకుండా చేస్తున్నారు. నా వెంట ఉన్న నాయకులని భయపెట్టి, పైసలతో ప్రలోభపెట్టి రాత్రికి రాత్రి టీఆర్ఎస్ లో చేర్చుకుంటున్నారు” అని ఆరోపించారు. రాష్ట్రంలో కుటుంబపాలన సాగుతోందని దాన్ని అంతం చేయడం బీజేపీతోనే సాధ్యమన్నారు.