అహంకారంతో మాట్లాడుతున్నావ్ కేటీఆర్.. ఖబర్ధార్ : రాజగోపాల్ రెడ్డి

60 ఏండ్లు పోరాటం చేసి, ఎంతో మంది ఆత్మ బలిదానాల తర్వాత తెలంగాణ తెచ్చుకున్నామన్నారు మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ పార్టీ  మునిగిపోతుందని తెలిసినా సోనియాగాంధీ ఇచ్చారని చెప్పారు. కేసీఆర్ పిరికిపంద అని, తనపై పోటీకి వంద మంది సైన్యాన్ని పంపారని ఆరోపించారు. ఢిల్లీ మద్యం కేసులో ఎమ్మెల్సీ కవితని అరెస్ట్ చేయకపోవడంతోనే బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఒక్కటేనని అందరికీ అర్థమైందన్నారు. మంత్రి కేటీఆర్ అహంకారంతో మాట్లాడుతున్నావ్ బిడ్డా... ఖబర్ధార్.. అంటూ హెచ్చరించారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ధర్మోజి గూడెంలో ప్రజా దీవెన భారీ బహిరంగ సభ నిర్వహించారు. 

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఒక్క బీఆర్ఎస్ అభ్యర్థి కూడా గెలవరని, అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వమన్నారు. ఎమ్మెల్యేగా ఉండి అసెంబ్లీలో ఎన్నోసార్లు మునుగోడు కోసం మాట్లాడితే రాష్ట్ర ప్రభుత్వం పైసా ఇవ్వలేదన్నారు. తాను రాజీనామా చేస్తే ప్రజల కాళ్లు, చేతుల దగ్గరికి వచ్చి పనులు చేశారని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామన్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కు ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా తనను గెలిపిస్తే సిద్దిపేట, సిరిసిల్లను తలదన్నెలా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.