తాను బీజేపీలో ఉన్నా కాంగ్రెస్ లో ఉన్నా ముఖ్యమంత్రి కేసీఆర్ ను గద్దె దించడమే లక్ష్యమన్నారు మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ను గెలిపించడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. తెలంగాణ వచ్చింది కేసీఆర్ కుటుంబం కోసం కాదని, తెలంగాణ ప్రజల బాగు కోసమన్నారు. కేసీఆర్ ను గద్దె దించేవరకు తాను విశ్రమించనని శపథం చేశారు.
కేసీఆర్ ను గద్దె దించే సత్తా కాంగ్రెస్ పార్టీకే సాధ్యమని ప్రజలు భావిస్తున్నారని.. అందుకే తాను కాంగ్రెస్లో చేరానని చెప్పారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండు మల్కాపూర్ గ్రామంలోని ఆందోల్ మైసమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత ఎన్నికల ప్రచారం ప్రారంభించారు.
మరోవైపు.. బీజేపీకి రాజీనామా చేసి, కాంగ్రెస్ లో చేరిన మరుసటి రోజే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మునుగోడు టికెట్ ఇవ్వడంతో నియోజకవర్గంలో అసంతృప్తి బయటపడింది. చలమల్ల కృష్ణారెడ్డి, పాల్వాయి స్రవంతితో పాటు ఇతర ముఖ్య నాయకులు కాంగ్రెస్ అధిష్టానంపై నిప్పులు చెరిగారు.