మునుగోడు ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నానని బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు. అయితే బై పోల్ లో నైతిక విజయం తనదేనని స్పష్టం చేశారు. పోలింగ్ జరిగే సమయం (నవంబరు 3) దాకా టీఆర్ఎస్ కు చెందిన 100 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కౌరవ సైన్యం మునుగోడు ప్రజలను ప్రలోభాలకు గురి చేసిందని మండిపడ్డారు. వాస్తవానికి అక్టోబరు 31వ తేదీ సాయంత్రం వరకు బీజేపీ ముందంజలో ఉందని గుర్తు చేశారు.
నవంబరు 1 తర్వాత ఇక్కడికి వచ్చిన టీఆర్ఎస్ నేతలు భయానక వాతావరణాన్ని సృష్టించి బీజేపీ కార్యకర్తలను బెదిరించారని ఆరోపించారు. తన ఒక్కడిని ఓడగొట్టేందుకు టీఆర్ఎస్ కౌరవ సైన్యం మొత్తం మునుగోడుకు వచ్చిందన్నారు. దేశ చరిత్రలో ఎన్నికల మధ్యలో ఒక రిటర్నింగ్ ఆఫీసర్ ను సస్పెండ్ చేయడం మొట్టమొదటిసారిగా మునుగోడులోనే జరిగిందని చెప్పారు. రిటర్నింగ్ ఆఫీసర్ పై కేసీఆర్, కేటీఆర్ బాగా ఒత్తిడి తీసుకొచ్చి తప్పులు చేయిస్తే ఎన్నికల సంఘం సస్పెండ్ చేసిందన్నారు.
పోలీసులు కూడా ఏకపక్షంగా వ్యవహరించి బీజేపీ శ్రేణులను అష్ట దిగ్బంధం చేశారని.. తనను ప్రచారం కూడా చేయనియ్యలేదని తెలిపారు. అయినా టీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇచ్చామన్నారు. ‘‘ ధర్మం వైపు ప్రజలు నిలిచి పోరాటం చేశారు. నిజానికి మేం గెలిచినట్టే. తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని తెలిసిపోయింది. భవిష్యత్తులో తెలంగాణలో రాబోయే మార్పుకు ఇది సూచిక’’ అని వ్యాఖ్యానించారు.
‘‘మునుగోడులో టీఆర్ఎస్ గెలిచినా అది నంబర్ గేమ్ మాత్రమే’’ అని కామెంట్ చేశారు. కారు గుర్తుకు ఓట్లు వేయకుంటే పెన్షన్లు రావని ప్రజలను బెదిరించి టీఆర్ఎస్ ఓట్లు వేయించుకుందని రాజగోపాల్ రెడ్డి తెలిపారు. ‘‘ఇది కరెక్ట్ రిజల్ట్ కాదు. పోలింగ్ రోజు కూడా డబ్బు, మద్యం పంచారు’’ అని చెప్పారు. ‘‘ఆరోజు తెలంగాణ కోసం పార్లమెంట్లో ఎలాగైతే కొట్లాడానో.. నా ప్రాణం ఉన్నంతవరకు కేసీఆర్ పై అదేవిధంగా పోరాడుతాను. కేసీఆర్ అవినీతి సొమ్ముకు కమ్యూనిస్టు నాయకులు అమ్ముడు పోయారు. కనీసం ప్రగతి భవన్లో అపాయింట్మెంట్ ఇవ్వని ముఖ్యమంత్రికి బుద్ధి చెప్పాల్సింది పోయి.. కమ్యూనిస్టులకు ఆయన పంచన చేరారు’’ అని చెప్పారు.