మంత్రులు, ఎమ్మెల్యేలు  గ్రామాల్లో తిరుగుతూ బెదిరిస్తుండ్రు

నల్గొండ జిల్లా: టీఆర్ఎస్ పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు మునుగోడులో పాగా వేసి ఓటర్లను, తమ కార్యకర్తలను బెదిరిస్తున్నారని  బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. రేపు మునుగోడు బై పోల్ జరగనున్న నేపథ్యంలో ఇతర ప్రాంతాలకు చెందిన వ్యక్తులు ఎవరూ కూడా మునుగోడులో ఉండొద్దని ఈసీ నిబంధనలు చెబుతుంటే... టీఆర్ఎస్ నేతలు మాత్రం మునుగోడును వదలడం లేదని ఆయన మండిపడ్డారు. దీనిపై ఫిర్యాదు చేయడానికి రాజగోపాల్ రెడ్డి కార్యకర్తలతో కలిసి చండూర్ లోని ఎన్నికల అధికారి కార్యాలయానికి చేరుకున్నారు. ఆర్వో లేకపోవడంతో ఆయన కార్యాలయం ముందు బైఠాయించి ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఈసీ, పోలీసుల తీరుపై రాజగోపాల్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. 

నెల రోజులుగా మునుగోడులో ఉంటూ టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు స్థానిక ప్రజలను మద్యం, డబ్బు పంచుతూ ప్రలోభాలకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల నిబంధనల ప్రకారం మునుగోడును విడిచి వెళ్లకుండా గ్రామాల్లో తిరుగుతూ డబ్బు పంచుతున్నారని ఆరోపించారు. అభ్యర్థినైన తనను నియోజవర్గంలో తిరగనివ్వడం లేదని, ఇదెక్కడి న్యాయం అంటూ ప్రశ్నించారు.  పోలింగ్ సిబ్బంది, పోలీసులు టీఆర్ఎస్ నేతలకు మద్దతు పలుకుతున్నారని ఫైర్ అయ్యారు. మునుగోడులో ఉన్న ఇతర ప్రాంతాలకు చెందిన వ్యక్తులను తక్షణమే బయటకు పంపాలని,  కేంద్ర బలగాలను మునుగోడుకు రప్పించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు.