ఇన్ని కోట్లు ఎక్కడివంటూ జగదీశ్​ రెడ్డికి రాజగోపాల్ రెడ్డి ప్రశ్న

అప్పుడు రూమ్​ రెంట్​ కట్టడానికి డబ్బుల్లేవు 
ఇప్పుడు ఇన్ని కోట్లు ఎక్కడివి?
మంత్రి జగదీశ్​ రెడ్డికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రశ్న


చండూరు, వెలుగు: ఉద్యమానికి ముందు మంత్రి జగదీశ్ రెడ్డికి కనీసం రూమ్ రెంట్ కట్టలేని పరిస్థితి ఉండేదని, ఇప్పుడు వేల కోట్లకు అధిపతి ఎలా అయ్యారో చెప్పాలని బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్​ రెడ్డి ప్రశ్నించారు. మంగళవారం గట్టుప్పల్​ మండలంలోని కమ్మగూడెం,శేరిగూడెం, తేరటుపల్లి గ్రామాలలో ప్రచారం నిర్వహించి మాట్లాడారు. మునుగోడు సమస్యలను పరిష్కరించాలని అసెంబ్లీలో ఎన్నోసార్లు మొత్తుకున్నానని, ఈ ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే రాజీనామా చేశానన్నారు. ‘వందల ఎకరాలున్న భూస్వాములకు రైతుబంధు వద్దని చెప్పాను తప్పా’ అని ఓటర్లను అడిగారు. కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేయడానికి మంత్రి అవసరమా అని ప్రశ్నించారు. ‘నువ్వు(జగదీశ్ రెడ్డి) మంత్రివే, కేటీఆర్ మంత్రే కానీ, కేటీఆర్ నియోజకవర్గం ఎట్లుంది? నీ నియోజకవర్గం ఎట్లుంది?’ అని అన్నారు. కేటీఆర్ దత్తత తీసుకోవడానికి మునుగోడు ప్రజలు ఏమైనా అనాథలా? లేక  మీరు నిలబెట్టిన అభ్యర్థి డమ్మీనా? అని ప్రశ్నించారు. కాగా, అంతంపేటలో నిర్వహించిన ప్రచారంలో ఉపఎన్నిక స్టీరింగ్ కమిటీ చెర్మన్ డా.జి వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీటీసీ మాదగోని జంగయ్య టీఆర్ఎస్​ నుంచి బీజేపీలో చేరారు.