- బీజేపీని ఓడించేందుకు కుట్రలు చేస్తున్నయ్
- రేవంత్, కవిత బిజినెస్ పార్ట్నర్స్
- నా సోదరుడు అన్నదాంట్లో తప్పేముంది?: రాజగోపాల్ రెడ్డి
మునుగోడు, వెలుగు : బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వా యి స్రవంతికి మద్దతుగా టీఆర్ఎస్ పార్టీ డబ్బు లు పంచుతోందని బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం మునుగోడులోని క్యాంప్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘హుజూరాబాద్ ఉప ఎన్నిక టైమ్‌లో నేను కాంగ్రెస్‌లో ఉండి కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని.. ఈటలను గెలిపించాలని కోరాను. ఇప్పుడు నా సోదరుడు కూడా పార్టీలకు అతీతంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పిండు. అందులో తప్పేముంది. ఇక్కడ ప్రచారానికి వచ్చిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సగం మంది నేను గెలవాలని కోరుకుంటున్నరు. కొందరు నాకు డైరెక్ట్ గా ఫోన్‌చేసి చెప్తున్నరు” అని అన్నారు. సీఎం కేసీఆర్ దిక్కుతోచని స్థితిలో ఉన్నారని బైపోల్లో ప్రజలు ఇచ్చే తీర్పుతో రాష్ట్రంలో టీఆర్ఎస్ పని అయిపోతుందని చెప్పారు. మంత్రులను, ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను మునుగోడులో దించి అవినీతి సొమ్ముతో నాయకులను కొంటున్నారని విమర్శించారు. ‘‘పదవీత్యాగం చేసిన నన్ను ఓడించడానికి ఇంతమంది అవసరమా’’ అని ప్రశ్నించారు. ప్రలోభాలతో రాజకీయాలు చేసే వారిని ఎవరూ నమ్మరని.. ప్రజలు బీజేపీ వైపే ఉన్నారన్నారు. ఈ బైపోల్ టీఆర్ఎస్ ను బొంద పెట్టి కేసీఆర్ ని గద్దె దించడానికి వచ్చిన ఎన్నికని అన్నారు.
ఏడ్చే రేవంత్‌ను నమ్మొద్దు
ఏ రోజైతే రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయ్యాడో ఆరోజే కాంగ్రెస్ పని అయిపోయిందని రాజగోపాల్‌రెడ్డి అన్నారు. ఏడ్చే రేవంత్ ను నమ్మొద్దని చెప్పారు. ‘‘ఢిల్లీ లిక్కర్‌స్కాంలో రేవంత్‌రెడ్డికి కూడా వాటా ఉంది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, రేవంత్ బిజినెస్ పార్ట్నర్స్’’ అని ఆరోపించారు. అప్పుల్లో ఉన్న తెలంగాణను గాడిలో పెట్టాలంటే బీజేపీతోనే సాధ్యమని తెలిపారు. తన రాజీనామాతోని గొల్ల కురుమ సోదరులకు డైరెక్ట్ గా అకౌంట్లోకి డబ్బులు వేశారని.. రాజగోపాల్ రెడ్డికి మంచి పేరు వస్తోందని డబ్బులను ఫ్రీజ్ చేశారని ఆరోపించారు. ఇప్పుడు ఓట్ల కోసం బీజేపీపై అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం నిలబడాలంటే బీజేపీని గెలిపించాలని కోరారు. యెన్నం శ్రీనివాస్ రెడ్డి, వీరెల్లి చంద్రశేఖర్ పాల్గొన్నారు.