సుధాకర్ కొడుకుకు ఫోన్ చేసి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డివార్నింగ్

సుధాకర్ కొడుకుకు ఫోన్ చేసి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డివార్నింగ్
  • ఇద్దరు నేతల మధ్య మాటల యుద్ధం
  • వెంకట్​రెడ్డి నయీంలా మారిండని సుధాకర్ ఫైర్

నల్గొండ, వెలుగు: కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కోమటిరెడ్డి లక్ష్యంగా సుధాకర్ ఇటీవల చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ కామెంట్లపై కోమటిరెడ్డి సీరియస్ గా స్పందించారు. ఆయన సుధాకర్ కొడుకు డాక్టర్ సుహాస్​కు ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చినట్లుగా చెబుతున్న ఆడియో ఒకటి బయటకు వచ్చింది. అందులో ‘‘నెల రోజులుగా సుధాకర్ నాపై లేనిపోని కామెంట్లు చేస్తున్నడు. ఇప్పటికి వందసార్లు తిట్టిండు. నా రాజకీయ జీవితంలో వందల మందిని బతికించిన. అలాంటిది నన్ను తిట్టడానికి ఎంత ధైర్యం ఉండాలి. నిన్నగాక మొన్న పార్టీలోకి వచ్చిన సుధాకర్.. ఇంటిపార్టీ పెట్టుకొని ఓ కౌన్సిలర్​గా కూడా గెలవలేదు. డైరెక్ట్​గా నా పేరు పెట్టి తిట్టిండు. అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఊకునే పరిస్థితుల్లో లేరు. సుధాకర్​ని చంపడానికి వంద కార్లలో తిరుగుతున్నరు. నిన్ను కూడా చంపుతరు. నల్గొండలో నీ హాస్పిటల్ కూడా నడవదు. మీ నాయనకు చెప్పు.. నేను ఎంత పెద్ద లీడరో. నాకు క్షమాపణ చెప్పకపోతే పార్టీ కార్యకర్తలు, అభిమానులు వదిలిపెట్టరు. వారం టైమ్ ఇస్తున్నాను” అని వార్నింగ్ ఇచ్చినట్లుగా ఉంది. 

వేరే ఉద్దేశంతో అనలేదు: కోమటిరెడ్డి 

చెరుకు సుధాకర్ పై తాను ఉద్దేశపూర్వకంగా కామెంట్లు చేయలేదని కోమటిరెడ్డి అన్నారు. ఆయన ‘‘వెలుగు’’తో మాట్లాడారు. ‘‘కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి పార్టీ మారినప్పటి నుంచి కాంగ్రెస్ లో నన్ను శత్రువులా చూస్తున్నారు. రాజగోపాల్​రెడ్డి పార్టీ మారితే నాకేం సంబంధం? రూ.20 కోట్లు ఖర్చు పెట్టి అద్దంకి దయాకర్​కు రెండుసార్లు టికెట్​ ఇప్పిస్తే అతనేమో నన్ను పార్టీ నుంచి బయటికి వెళ్లిపో అని కామెంట్ చేసిండు. పీసీసీ చీఫ్ రేవంత్ హోంగార్డు అని మాట్లాడిండు. ఇక చెరుకు సుధాకర్ నాకు వ్యతిరేకంగా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుండు. ఇదంతా రేవంత్ మెప్పు కోసం చేస్తున్నరు. పార్టీ నుంచి నన్ను బయటకు పంపాలనే కుట్ర జరుగుతోంది” అని అన్నారు. ‘‘నేను ఎప్పుడూ బీసీ, ఎస్సీలకు వ్యతిరేకం కాదు. చెరుకు సుధాకర్​ సోషల్ మీడియాలో నన్ను తక్కువ చేస్తూ మాట్లాడిండు. బూతులు తిట్టిండు. దీంతో భావోద్వేగానికి లోనై సుధాకర్ కొడుకుతో అలా మాట్లాడాల్సి వచ్చింది.  మరో ఉద్దేశం లేదు” అని చెప్పారు. ‘‘నా పనేదో నేను చేసుకుంటూ పోతుంటే.. మధ్యలో ఇలాంటోళ్లు నా ఇమేజ్​దెబ్బతీయాలని చూస్తున్నరు. ఇలాంటి కుట్రలు చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలా? వద్దా? అనే ఆలోచన కూడా వస్తున్నది” అని అన్నారు.  

ఆడియో రికార్డులు పార్టీకి పంపిన: చెరుకు సుధాకర్ 

కోమటిరెడ్డి కామెంట్లపై సుధాకర్ స్పందించారు. నల్గొండలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘సడెన్​గా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నయీం అవతారం ఎత్తిండు. నయీం బతికున్నప్పుడు ఇలాంటి లీడర్లతో సంబంధాలు ఉన్నాయి. నయీం కూడా నన్ను చంపాలని చాలా సందర్భాల్లో అనుకున్నడు. నేను ఎన్నో కష్టాల నుంచి ఈ స్థాయికి వచ్చిన. వ్యక్తిగతంగా వెంకట్ రెడ్డితో పోటీ పడింది లేదు. ఆయనను దూషించింది కూడా లేదు. కానీ ఆయన ‘నీ అయ్యను చంపేస్తా..’ అని నా కొడుకుకు ఫోన్ చేసి బెదిరించడం కరెక్టు కాదు” అని అన్నారు. ‘‘వెంకట్ రెడ్డి ఆడియో రికార్డులను మాణిక్​రావు ఠాక్రే, రేవంత్​రెడ్డికి పంపించాను. వాళ్లు స్పందిస్తారనే నమ్మకం ఉంది. వెంకట్​ రెడ్డి చేసిన కామెంట్లు నా ఒక్కడికే వర్తించవు. ఎవడు పడితే వాడు ఎట్ల పడితే అట్ల మాట్లాడటం మంచి పద్ధతి కాదు. పార్టీ స్పందించే వరకు వెయిట్ చేసే వ్యక్తిని కాదు నేను.   ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తిని” అని అన్నారు.